న్యూస్ లైన్ డెస్క్ : దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. పలు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా రానున్న వారం రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్నీ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
సెప్టెంబర్ 3 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, శుక్రవారం సాయంత్రం తర్వాత కుంభవర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది.