Raksha Bandhan: మమతానురాగాలకు ప్రతీక రక్షాబంధన్‌

అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. 
 


Published Aug 18, 2024 04:40:38 AM
postImages/2024-08-18/1723974019_rakshabandhan.jpg

న్యూస్ లైన్ స్పెషల్: రక్షాబంధన్‌.. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్‌ పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. 

సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు. రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది? ఆ చరిత్ర ఏంటి? అనేది తెలుసుకుందాం 
రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడువేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపతి తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతి హామీ ఇచ్చారట.అందుకు ప్రతిగానే దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కూడా కాపాడారని పురాణాలు చెబుతున్నాయి. 

అంతే కాదు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళలోకానికి వెళ్లి అక్కడే ఉండిపోగా, విష్ణు తీసుకువెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి, తనకు రక్షణ కల్పించమని  కోరుతుంది. బలి చక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. 


ఈనాటికీ ప్రతి ఒక్కరు రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీక గా జరుపుకుంటారు. సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది. రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరీమణులు. 

సోదరులపై ప్రేమ అంత తెలిసేలా అందమైన రాఖీలను సోదరుల కోసం కొనుగోలు చేస్తారు.  
నుదుటన బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, స్వీట్‌ తినిపిస్తారు. చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని, అక్కడైతే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. నీకు నేను ఎప్పుడూ రక్ష అని చెప్తూనే, నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు. ఇక రక్షా బంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరీమణులకు ఎనలేని ప్రేమ. వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు. తీపి జ్ఞాపకంగా భావిస్తారు. 

రాఖీ పండుగ రోజు సోదర సోదరీమణులు రక్షాబంధనాన్ని కట్టిన తరువాత అన్నదానం చేస్తే విశేషమైన ఫలితాలను, ఏ పనులు తలపెట్టినా మంచి శుభం చేకూరుతుందని శాస్త్రం చెప్తుంది.  
రక్షాబంధనం అంటే ఒకరిపై ఒకరికి ఉండే ప్రేవనురాగాలకే కాదు మానవ సంబంధాలకు, అనుబంధాలకు సంబంధించిన పండుగ. అందుకే ఈ రాఖీ పండుగ ప్రతి అన్నకి, చెల్లికి అపురూపమైన పండుగ..

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam rakhi rakshabandhon rakshabandhan rakhifestival

Related Articles