ఒకప్పుడు నిండుకుండలా జలకళతో కకళలాడిన రిజర్వాయర్లు నేడు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. సాగునీరు లేక రైతులు పంటలు ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోసే రంగనాయక సాగర్ తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కుంటోంది.
న్యూస్ లైన్ డెస్క్ : మెదక్ జిల్లాలో ఒకప్పుడు నిండుకుండలా జలకళతో కకళలాడిన రిజర్వాయర్లు నేడు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. సాగునీరు లేక రైతులు పంటలు ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోసే రంగనాయక సాగర్ తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కుంటోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రంగనాయక సాగర్ సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామ సమీపంలో నిర్మించారు. 2300 ఎకరాల్లో 3,300 కోట్ల వ్యయంతో 3 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ ను నిర్మించారు. సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాలోని లక్షా 14 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ రిజర్వాయర్ సాగునీరు అందించింది.
2020లో ప్రారంభించబడ్డ రంగనాయక సాగర్ కి కాళేశ్వరం 7వ లిఫ్టు కింద నీటి సరఫరా జరుగుతోంది. రాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయానికి గోదావరి జలాలు అందుతాయి. గోదావరి జలాలతో గతంలో ఈ రిజర్వాయర్ కళకళలాడేది. కాగా.. నేడు రిజర్వాయర్ లో జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. చుక్క నీరు కూడా లేక ఎడారిని తలపిస్తోంది. ఉమ్మడి మెదక్ లో నిర్మించిన కొండపోచ్చమ, మల్లన్న సాగర్ లోని సాగునీరు వెళ్లాలంటే రంగనాయక్ సాగర్ నుంచే మళ్లించాలి. అయితే.. ఇప్పుడు ఏకంగా రంగనాయక్ సాగర్ లోనే జలాలు నిండుకోవడంతో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లు సైతం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రంగనాయక సాగర్ పూర్తిగా ఎండిపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల ద్వారా వచ్చే సాగునీళ్లతో వ్యవసాయం చేసుకునేవాళ్లం. ఇప్పుడు రిజర్వాయర్ ఎండిపోవడంతో పంటలకు సాగునీరు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.