సోమవారం ఓటుకు నోటు కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కవిత బెయిల్ పై కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులను కోర్టు ముందు పెట్టారు జగదీష్ రెడ్డి తరుపు న్యాయవాది. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీ హ్యాండిల్స్‌లో... న్యాయవ్యవస్థను, కోర్టును, కోర్టు తీర్పులను ధిక్కరించేలా పోస్టులు పెడుతున్నారని చూపించారు. దీంతో కోర్టు మరోసారి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని రేవంత్ తరుపు న్యాయవాదులను ఆదేశించింది. ఇది పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓవర్ కాన్ఫిడెన్స్, ఎవర్నీ లెక్క చేయకపోడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి.. అటు పార్టీకి చెడ్డ పేరు వస్తోందని సీనియర్లు గుస్సా అవుతున్నారట.
ఏదో ఒక్క విషయంలో అంటే సర్దుకుపోవచ్చు.. కానీ ప్రతీ విషయంలో ఆయన చేసిన పని పెంట అవుతుంటే ఎలా ఊరుకోవాలంటూ మండిపడుతున్నారట. పైగా తాను చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు తన భజన మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయించుకుని మరో తప్పు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఓ వైపు కాంగ్రెస్ అధిష్టానం ఇదే లిక్కర్ కేసులో తమ కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సిసోడియాకు బెయిల్ వస్తే స్వాగతించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసిన అభిషేక్ సింఘ్వీనే వాళ్లకు బెయిల్ ఇప్పించారు. అదే కేసులో కవితకు బెయిల్ వస్తే మాత్రం రేవంత్, ఆయన వర్గం నేతలు తప్పుపడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పునే తప్పు పట్టడం ఏంటని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. పార్టీకి ఒక నియమం ఉంటుందని అది అందరూ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారట. సొంత ప్రయోజనం కోసం పార్టీ స్టాండ్ మార్చితే ఎలా అని రేవంత్ వ్యవహారంపై అసహనంతో ఉన్నారట. వ్యవహారాలు ఇలాగే కొనసాగితే పార్టీకి రాష్ట్రంలో ఎదురుదెబ్బ తప్పదనే ఆందోళనలో ఉన్నారట రాష్ట్ర కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేక వర్గం నేతలు.