కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పాలన కాదు.. రాష్ట్రంలో ప్రజల మీద ప్రతీకార పాలన సాగుతోందని విమర్శించారు. విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద ప్రతీకార పాలన నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రభుత్వ విద్యావ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని BRS నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిపోతోందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు అవుతున్నా.. ఇప్పటికీ విద్య శాఖ మంత్రి లేరని ఆయన విమర్శించారు.
ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ పాఠశాలలను ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన వెల్లడించారు. దీంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పాలన కాదు.. రాష్ట్రంలో ప్రజల మీద ప్రతీకార పాలన సాగుతోందని విమర్శించారు. విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద ప్రతీకార పాలన నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్నారని ఆయన అన్నారు. దీనిపై రేవంత్ రెడ్డికి అవగాహన ఉందో లేదో అర్ధం కావడం లేదని ఆయన విమర్శించారు. 2023-24 సంవత్సరానికి విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌ల బకాయిలు రూ.5900 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లో పైచదువుల కోసం వెళ్లే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల బకాయిలు ఉండడంతో యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. దీంతో చదువులకు పేద విద్యార్థులు దూరమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు. ఈ సమస్యలన్నీ విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. ప్రజావాణిలో ప్రతిరోజూ వినతులు తీసుకుంటామని చెప్పిన సీఎం.. ప్రజా భవన్‌కు ఒక్కరోజే వెళ్లి మొహం చాటేశారని ఆయన వెల్లడించారు. అక్కడ ఒక అధికారిని పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.