జైలు నుండి తిరిగి వచ్చిన తరువాత కవిత పెట్టిన పోస్ట్ ఇదే కావడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
న్యూస్ లైన్ డెస్క్: MLC కవిత జైలు నుండి విడువులైన తర్వాత తొలిసారిగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ ఆయన ఆమె గత ఐదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఆమెపై కేసు వేశాయి. దీంతో ఆమె బెయిల్ కోసం పలు మార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్లపై ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ప్రతిసారీ వాయిదాతోనే విచారణ జరిగింది.
దీంతో కవిత ఢిల్లీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు లిక్కర్ పాలసీ కేసుతో సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరారు. ఇక మంగళవారం సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంచిందిన తుది విచారణ జరిగింది. విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. కవితపై ఇప్పటివరకు ఈడీ, సీబీఐ ఆరోపణలు మాత్రమే చేశాయని అసహనం వ్యక్తం చేసింది. ఒక్కసారి కూడా ఆధారాలు బయటపెట్టలేదని తెలిపింది. ఒక మహిళగా సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు కవిత అర్హురాలని స్పష్టం చేసింది.
ఈ మేరకే ఈడీ, సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ కవితకు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా, ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కూడా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో కొన్ని డాక్యూమెంట్లు స్పష్టంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి విచారణను వచ్చే నెల 11కు వాయిదా వేశారు. ఇదంతా చూస్తుంటే.. లిక్కర్ కేసు అనేది రాజకీయ కక్షతోనే తెరపైకి వచ్చిందని పలువురు చెబుతున్నారు.
జైలు నుండి రాగానే తప్పుచేయకున్నా జైలుకు పంపారని కవిత చెప్పిన విషయం తెలిసిందే. అనవసరంగా తనను జగమొండిగా మార్చారని వడ్డీతో సహా చెల్లిస్తానని కవిత అన్నారు. ఇక 160 రోజుల బ్రేక్ తరువాత కవిత తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. 'సత్యమేవ జయతే' అంటూ తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌లతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇక లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి, జైలు నుండి తిరిగి వచ్చిన తరువాత కవిత పెట్టిన పోస్ట్ ఇదే కావడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
సత్యమేవ జయతే pic.twitter.com/Q0HzR0aouy — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 29, 2024