ఈ ఉచిత బస్సు ప్రయాణం అంశంపై తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.శ్రీనివాస్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో ఏర్పాటు చేసిన ఫెడరేషన్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీకి జరుగుతున్న నష్టంపై స్పందించారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించి.. అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకే ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కూడా ఒప్పదం చేసుకున్నారు.
అయితే, ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సుల్లో రద్దీ పెరిగింది. అంతేకాకుండా అటు మహిళలు, ఇటు పురుష ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇలా ఉంటే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే కాన్సెప్ట్ వల్ల ఆర్టీసీ అధికారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే తమకు సమయానికి జీతాలు రావడంలేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా, ఈ ఉచిత బస్సు ప్రయాణం అంశంపై తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.శ్రీనివాస్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో ఏర్పాటు చేసిన ఫెడరేషన్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీకి జరుగుతున్న నష్టంపై స్పందించారు.
ఉచిత బస్సు వల్ల కేవలం 6 నెలల్లోనే ఆర్టీసీకి రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.15 కోట్ల చొప్పున నష్టం జరుగుతోందని అన్నారు. అయితే, ఇందులో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదని ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు రూ. 2,500 కోట్ల నిధులను తక్షణం సంస్థకు చెల్లించాలని డిమాండ్ శ్రీనివాస్ రావు చేశారు.