కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేని అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సొంత పార్టీ ఎంపీలతో పాటు.. తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 48,21,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన అనేదే లేదు. దీంతో ప్రాంతీయ పార్టీ అయిన BRS కేంద్ర బడ్జెట్‌పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అన్ని కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు కొంత కూడా కేటాయించకపోవడం సరికాదని మండిపడుతున్నారు. నాలుగు ఎంపీ స్థానాల నుండి రెట్టింపు చేసి ఎనిమిది స్థానాలకు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడుతున్నారు.
తాజగా, ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాదని ఆయన అన్నారు. బీజేపీ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్‌ను రూపొందించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిహార్‌కు రూ.41 వేల కోట్లు కేటాయించారని, ఏపీకి రూ.15 వేల కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని ఆయన అన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. అందుకే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు విన్న వారంతా.. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు.