రాబోయే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ ప్రకటించింది. ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
న్యూస్ లైన్ డెస్క్ : చిలికా సరసు సమీపంలోని ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని కారణంగా తెలంగాణలో రాగల 48 గంటలు వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ తెలిపింది. పూరీకి 40 కి.మీ దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఒడిశా, ఛత్తీస్ గఢ్ మీదుగా కదులుతూ 12 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శనివారం మొదలైన వర్షాలు ఆదివారం కూడా కురువనున్నాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లాలో వెంకటపురంలో అత్యధికంగా పది సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది.