క్షేత్ర స్థాయిలో మంత్రి పర్యటిస్తున్నారని తమ సమస్యలను చెప్పుకోవడానికి రైతులు వెళ్లారు. సమస్యలు చెప్పుకోవడం కాదు కదా.. కనీసం ఆయన దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా ఉత్తమ్ సిబ్బంది రైతులను అడ్డుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్లిన రైతులకు అవమానం జరిగింది. వరదల కారణంగా ఎంతో నష్టపోయామని తమ గోడు వెళ్లబోసుకోవడానికి వెళ్లిన రైతలను ఉత్తమ్ సిబ్బంది గెంటేశారు. సోమవారం నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువను పరిశీలించేందుకు ఉత్తమ్ వెళ్లిన విషయం తెలిసిందే.
అనంతరం కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగుని పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కోతకు గురైన రహదారిని పరిశీలించిన ఉత్తమ్.. ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని అన్నారు. అయితే, క్షేత్ర స్థాయిలో మంత్రి పర్యటిస్తున్నారని తమ సమస్యలను చెప్పుకోవడానికి రైతులు వెళ్లారు. సమస్యలు చెప్పుకోవడం కాదు కదా.. కనీసం ఆయన దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా ఉత్తమ్ సిబ్బంది రైతులను అడ్డుకున్నారు. పక్కకి వెళ్లండి అంటూ తోసేశారు.
అంతేకాకుండా, ఉత్తమ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళా రైతుని కూడా ఆయన సిబ్బంది అడ్డుకున్నారు. ఒకేసారి సిబ్బంది అడ్డుకోవడంతో.. తీమేదో పెద్ద తప్పు చేశామని అనుకొని భయంతో రైతులు పక్కకు వెళ్లిపోయారు. మీడియా చూస్తుండగా మంత్రి ముందే అన్నదాతలకు అవమానం జరిగింది. అయితే, అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న మంత్రి ఉత్తమ్ కనీసం తన సిబ్బందిని వారించకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కళ్ల ముందే రైతులకు అవమానం జరుగుతుంటే ఉత్తమ్ మాత్రం చేతులు కట్టుకొని ఏమీ పట్టనట్టు చుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని చెప్పుకొని వెళ్లే రాజకీయ నాయకులకు కనీసం రైతుల కష్టాలను కూడా పట్టించుకునేంత సమయం లేదా అని ప్రశ్నిస్తున్నారు.