రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూళ్ల టీచర్లపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లకు సంక్షేమ బోర్డు ఉండాలని ప్రైవేట్ బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టానని గుర్తుచేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఉపాధ్యాయుల సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ టీచర్లను కించపరిచే విధంగా మాట్లాడారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. వెళ్లిన ప్రతి చోటా.. అక్కడ ఉన్న వారిని రేవంత్ మునగ చెట్టు ఎక్కిస్తారని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు.
వెనకబడిన ప్రాంతాల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలలను రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదని అన్నారు. రేవంత్ రెడ్డి కూడా తన మనవలు మనవరాళ్లను ప్రైవేటు స్కూల్‌కే పంపే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లలో పదో తరగతి ఫెయిల్ అయిన వారు ఉపాధ్యాయులుగా ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు.. అది ఎవరి తప్పు అని ప్రశ్నించారు.
విద్యా హక్కు చట్టం కింద శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉండాలని, చాలా స్కూళ్లల్లో శిక్షణ పొందిన టీచర్లు ఉన్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూళ్ల టీచర్లపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లకు సంక్షేమ బోర్డు ఉండాలని ప్రైవేట్ బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టానని గుర్తుచేశారు.
ఎంతో మంది నైపుణ్యం ఉన్న వాళ్లను సమాజానికి అందిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ తర్వాత సాయం అందించాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ తెలిపారు. విద్య విషయంలో అనేక రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉన్నామని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు పాఠశాలల్లోకి వెళ్లారు. ఈ అంశంపై రేవంత్ దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో ఉన్న టీచర్లకు సంరక్షణ చట్టం తీసుకురావాలని సూచించారు. త్వరలోనే లక్ష మంది ప్రైవేట్ టీచర్లతో సభ పెట్టి సంరక్షణ చట్టం కోసం ఒత్తిడి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.