Wayanad : వయనాడ్ విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న ఫోన్ కాల్

కొండ చరియలు విరిగిపడుతున్నాయని.. ప్రాణాలు పోతున్నాయని.. ఎమర్జెన్సీ కాల్ చేసిన ఓ మహిళ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Published Aug 05, 2024 02:19:45 PM
postImages/2024-08-05/1722847785_KeralaFamily.jpg

న్యూస్ లైన్ డెస్క్ : కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో రోజురోజుకు హృదయవిదారకమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయని.. ప్రాణాలు పోతున్నాయని.. ఎమర్జెన్సీ కాల్ చేసిన ఓ మహిళ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయనాడ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడదికల్ సైన్సెస్ లో పనిచేసే మహిళ ప్రాణాలు కాపాడుకునేందుకు  చేసిన ఫోన్ కాల్ కన్నీరు పెట్టిస్తోంది.

గత నెల 30 వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలో కొండ ప్రాంతాల్లో భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. నీతూ జోజో అనే మహిళ ఈ ప్రమాదం గురించి వెంటనే ఎమర్జెన్సీకి సహాయం కోసం కాల్ చేసింది. మేము ప్రమాదంలో ఉన్నాం. మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. రక్షించండి.. చూరల మలై వద్ద కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మేము పాఠశాల వెనుక ఉన్నాం. మాకు దయచేసి సహాయం చేయండి. ఎవరినైనా పంపించండి. మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇంటి చుట్టూ నీరే ఉంది. ఏడు కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు, మహిళలు ఇక్కడ ఉన్నాం.. అంటూ ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. తాము వస్తున్నామని.. కంగారు పడొద్దని.. రెస్క్యూ టీమ్ లు ఆమెకు ధైర్యం చెప్పాయి. అయితే.. సహాయక బృందాలు వెళ్లేసరికి జరగకూడని దారుణం జరిగిపోయింది.

మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు రాత్రికి రాత్రే నదీ ప్రవాహం బెడ్రూమ్ వరకు రావడంతో ఆమెకు మెళకువ వచ్చింది. చూరల్ మలై లోని హైస్కూల్ రోడ్డులో ఉన్న ఆమె ఇల్లంతా జలమయమయింది. టు చూసినా కొట్టుకొస్తున్న వాహనాలు, కుప్పకూలిన శిథిలాలు, మట్టి, బురద కనిపించాయి. మెప్పాడిలోని మూపెన్స్ కాలేజీ మొత్తం నీట మునిగింది. నీతూ జోజో వెంటనే అప్రమత్తమై భర్త జోసెఫ్ ని నిద్రలేపింది. చూస్తుండగానే వారి చుట్టుపక్కల ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. వారందరికీ కొండపై ఉన్న తన ఇంట్లో ఆశ్రయమిచచింది నీతూ. రాత్రి ఒంటిగంట ముప్పై నిమిషాలకు దవాఖానాకు ఫోన్ చేసింది. 2:18 గంటలకు మరోసారి హాస్పిటల్ కి ఫోన్ చేసింది. చూస్తుండగానే వంటగది కూలిపోయి కొట్టుకుపోయింది. సాయం కోసం ఎదురు చూస్తూ నీతూ నీటిలో కొట్టుకుపోయింది. కొండమీద ఉన్న ఇంట్లో ఆమె భర్త జోసెఫ్, ఐదేళ్ల కుమారుడు, తల్లిదండ్రులు మాత్రం క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్ డ్రైవర్ తో ఫోన్ లో మాట్లాడుతుండగానే చెట్లు కూలిపోయాయి. రోడ్డు మార్గం పూర్తిగా స్థంభించింది. చూరల్ మలై వంతెన కొట్టుకుపోయింది. అంబులెన్స్, ఇతర రెస్క్యూ టీమ్ నీతు దగ్గరకు రాలేకపోయాయి. ఫలితంగా నీతూ వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. కొండ చరియలు విరిగిపడుతుంటే.. వరద నీరు ముంచెత్తుతుంటే ప్రాణభయంతో నీతూ చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

newsline-whatsapp-channel
Tags : rains national cityrains latest-news telugu-news wayanad kerala wayanadfloods

Related Articles