రుణమాఫీ చేసింది రూ.8వేల కోట్లే
రైతులకు రూ.23కోట్లు దగా చేసింది
రైతుబంధు కింద రూ.12,500 కోట్లు ఎగ్గొట్టింది
అప్పులపై సీఎం కంటే భట్టి క్లారిటీ ఉంది
పదేళ్లలో BRS చేసిన అప్పు రూ.4లక్షల కోట్లే
కాంగ్రెస్ ఏడాదిలోనే రూ.1.58కోట్ల అప్పు
అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 27) : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది కేవలం రూ.8వేల కోట్లే అన్నారు. వానకాలం రైతుబంధు రూ.8వేల కోట్లు, యాసంగిలో రూ.4500 కోట్లు ఎగ్గొట్టిందని, వాటిని రుణమాఫీ కింద కలిపిందని వివరించారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం రుణమాఫీ మొత్తం రూ.20వేల కోట్లు చేస్తే అందులో రైతుబంధు పైనలే రూ.1200 కోట్లని క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన ప్రభుత్వం రుణమాఫీకి రూ.8వేల కోట్లే చేసిందని చెప్పారు. బడ్జెట్ లో రుణమాఫీకి రూ.31వేల కోట్లు పెట్టి చేయలేదని అన్నారు. మొత్తంగా రైతులకు ఈ ఏడాదిలో రూ.23వేల కోట్లు కోత పెట్టారని, ఈ లెక్కన మొత్తం 5ఏళ్లలో లక్ష కోట్లు ఎగ్గొట్టే కుట్ర చేస్తోందని ఆరోపించారు.
అప్పులపై భట్టి విక్రమాకర్క పొరపాటుననో, లేక గ్రహపాటుననో వాస్తవం చెప్పారన్నారు. తన స్పీచ్ లో మొత్తం 16 నెలల కాంగ్రెస్ పాలనలో అప్పులకు రీ పేమెంట్, మిత్తిలకు రూ.88,564 కోట్లు ఖర్చు పెట్టామని భట్టి విక్రమార్క చెప్పారని తెలిపారు. కానీ ఇదే సభలో ఇదే రోజు మధ్యాహ్నం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అప్పులు, మిత్తిలకు రూ.లక్షా 53వేల కోట్లు కట్టామని నిండు సభలో అబద్దం చెప్పారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులపై కూడా సర్కార్ తప్పుడు లెక్కలు చెప్పిందన్నారు. కాగ్ లెక్కల ప్రకారం అన్ని అప్పులు కలుపుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.4,18,284 కోట్లు మాత్రమే అన్నారు. ఇందులోనే కాళేశ్వరం, మిషన్ భగీరథ అప్పులు కూడా ఉన్నాయన్నారు. భట్టి విక్రమార్క లెక్కల ప్రకారం రూ.4,22,674 కోట్లు ఉందన్నారు. ఈ లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాదికి రూ.41వేల కోట్ల నుంచి రూ.42వేల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.లక్షా 58వేల కోట్ల అప్పు చేసిందని హరీష్ రావు వివరించారు.