సెంట్రల్ ప్రాజెక్టులు పూర్తి చెయ్
ఎన్ని పైసలు కావాలన్నా ఇస్తా..!
పెండింగ్ పనులు పూర్తి చెయ్
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇస్తా
మీరే చేయడం లేదని సీఎంకు మోడీ సూచన
తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 26): ఎంత అడిగినా రాష్ట్రానికి పైసా కూడా విదల్చని మోడీ సర్కార్ .. రేవంత్ ఢిల్లీ పర్యటన సందర్భంగా అందరినీ షాక్‌కు గురి చేసేలా వ్యవహరించింది. రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ ప్రాజెక్టులపై స్వయంగా ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించని సర్కార్, పలుసార్లు ఢిల్లీకి వెళ్లి కలిసినా నామమాత్రంగా కూడా స్పందించని మోడీ.. ఇప్పుడు తనే పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్‌తో మాట్లాడటం చర్చనీయాంశమైంది. 2017 నుంచి 2022 వరకు ఉన్న పెండింగ్ అంశాలపై దృష్టిపెట్టాలని సీఎం రేవంత్‌కి ప్రధాని మోదీ సూచించారు. ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణపథకం అమలు కావడం లేదని.. 2025 మార్చి 31 నాటికి సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించాలని సీఎం రేవంత్‌కి సూచించారు. శంషాబాద్ ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి రూ.150 కోట్లు చెల్లించాలన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 3మొబైల్ కనెక్టివిటీప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్‌కి విద్యుత్, వాటర్ సప్లై కోసం రూ.1365.95 కోట్లు చెల్లించాలని సూచించారు. తెలంగాణలో రెండు రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం.. అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మూడు నీటి పారుదల ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించి పంపాలని మోదీ సూచించడం గమనార్హం. ఎన్ని పైసలు కావాలన్నా ఇస్తానని , పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. కేంద్ర నుంచి రావల్సిన నిధులు ఇస్తా అని, రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేయడం సీఎంతో మోడీ వ్యాఖ్యానించారు.