అడుగు పెడ్తే అరెస్ట్ చేస్తం..!
HCU భూముల్లోకి నో ఎంట్రీ
బయటివాళ్లకు పర్మిషన్ లేదు
పోలీసుల కీలక ఆదేశాలు
చెట్ల నరికివేత వీడియోలు..
బయటకు రావడమే కారణమా..?
తెలంగాణం, హైదరాబాద్ (ఏప్రిల్ 4) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సైబరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, బయటి వ్యక్తులు ఎవరూ ఆ భూముల్లోకి వెళ్లొద్దంటూ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో ఈ ప్రాంతం చుట్టూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భూముల్లో ప్రజల రాకపోకలపై పూర్తి ఆంక్షలు విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ భూముల వద్దకు ఎవరూ రావొద్దని సూచనలు చేసింది. బయటి వ్యక్తులపై నిషేధం విధించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధం లేని వ్యక్తులను ఆ భూముల్లోకి ఎంటర్ కావ్వొద్దని , ఎవరైనా ఆంక్షలు అతిక్రమించి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
గచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టు కొట్టదని సుప్రీం కోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెట్లను నరకడంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, తాము మళ్లీ తీర్పు ఇచ్చేంత వరకు అక్కడ పనులు నిలిపివేయాలని సూచించింది. చీఫ్ సెక్రటరీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ ఎలాంటి పనులు జరిగినా బాధ్యత వహించాలని, అవసరమైతే జైలుకు వెళ్తారంటూ మందలించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో పనులు ఆపేశారు. అక్కడ ఎలాంటి పనులు జరగకుండా చూసుకునేందుకు అందులోకి ఎవరికి అనుమతించడం లేదు. దీనిలో భాగంగానే సైబరాబాద్ పోలీసులు నో ఎంట్రీ పెట్టినట్లుగా తెలుస్తోంది.
అయితే.. పనులు చేసేందుకు వచ్చిన కొన్ని జేసీబీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ఇప్పటికీ ఆ భూముల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఎలాంటి పనులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా వాహనాలు అక్కడే ఉన్నాయని విద్యార్థులు.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరోవైపు.. ఇప్పటికే ఎత్తున చెట్లు నరికివేయడంతో.. విద్యార్థులు, మీడియా ప్రతినిధులు అటువైపు వెళ్లి వాటిని చిత్రీకరిస్తున్నారు. బయటి ప్రపంచానికి చూపిస్తున్నారు. ఈ విధ్వంసకాండ బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.