మంత్రులు నా సీటుపై కన్నేశారు!


Published Feb 16, 2025 12:49:29 PM
postImages/2025-02-16/1739690369_638059revanth.webp

మంత్రులు నా సీటుపై కన్నేశారు!

వాళ్లు ఎవరూ పని చేస్తలేరు

నేను మాత్రమే పని చేస్తున్నా

మంత్రులపై రాహుల్‌కు ఫిర్యాదు చేసిన సీఎం

ఢిల్లీ పర్యటనలో రాహుల్‌తో 45నిమిషాలు భేటీ

రాష్ట్ర వ్యవహారాలపై ఆరా తీసిన అగ్రనేత

కేబినెట్ సహచరులపై రేవంత్ సీరియస్ ఆరోపణలు

సీఎం పదవిపైనే వారి ఆశలని తెలిపిన ముఖ్యమంత్రి

సంచలనంగా మారిన సీఎం వ్యాఖ్యలు

మంత్రులతో సఖ్యత లేదని చెప్పకనే చెప్పిన రేవంత్

కేబినెట్‌లో తన మాట విలువ లేదని గుస్సా

 

 ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తుంది. తన పదవిపైనే వారందరి చూపు ఉందని, ఎవరూ పని చేయడం లేదని, తాను మాత్రమే పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చినట్టుగా సమాచారం. అందరికీ ముఖ్యమంత్రి పదవినే ఆశలు ఉన్నాయని పేర్కొన్నట్టుగా చెబుతున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై రాహుల్ గాంధీ వివరణ కోరగా పార్టీలో కష్టనష్టాలన్నీ తనవేనని ఆయన అన్నట్టుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. తన కష్టం వల్లే ప్రభుత్వం నడుస్తుందని, హామీలు ఇచ్చింది తానని, వాటిని నెరవేర్చకపోతే అడిగేది కూడా తననేని ఆయన పేర్కొన్నట్టుగా తెలుస్తుంది.

 

తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 15): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రాహుల్, రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉందంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. టెన్ జన్ పథ్‌లోని సోనియా గాంధీ నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా తన సహచర మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తుంది. వారందరికీ తన పదవిపైనే గురి ఉందని, ఎవరూ పని చేయడం లేదని రాహుల్ గాంధీకి రేవంత్ ఫిర్యాదు చేశారట. కేవలం పదవి కోసం మాత్రమే ఉన్నారని, పాలనపై దృష్టి పెట్టడం లేదని పేర్కొన్నారట. గ్యారంటీల అమలు కోసం తను అహర్నిశలు శ్రమిస్తున్నామని, అయితే మంత్రుల నుంచి సహకారం అందడం లేదని వాపోయారట. ఇలా అయితే పాలన సజావుగా ఎలా సాగుతుందని రాహుల్‌ గాంధీకి రేవంత్ విన్నవించారట.

 

రేవంత్ ఫిర్యాదు వార్తలు గుప్పుమనడంతో పార్టీలో తీవ్ర దుమారమే రేగుతోంది. ఇన్నాళ్లు మంత్రివర్గంలో విభేదాల గురించి ఆనోటా ఈనోటా వింటూ వస్తున్నవారికి, సీఎం తాజా వ్యాఖ్యలతో అసలు విషయం బోధపడిందన్న చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఎప్పటి నుంచో సీఎం కుర్చీపై ఆశలతో ఉన్నారనే విషయం తెలిసిందే. పార్టీలో సీనియర్లు, పార్టీని ఏళ్లుగా అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకున్న కొద్దిరోజులకే సీఎం సీటు పొందడం పలువురి ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అధిష్ఠానం నిర్ణయంతో అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే అప్పుడప్పుడు మంత్రివర్గం భేటీలలో, ఇతర సమావేశాల్లో తమ అసంతృప్తిని వారు వెల్లగక్కుతున్నారన్న చర్చ జరుగుతోంది. తనకు వాళ్ల నుంచి సరైన గౌరవం దక్కకపోవడంపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కినట్టు చెబుతున్నారు. తన మాట వినడం లేదని, తనను పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీకి చెప్పినట్టుగా తెలుస్తుంది.   

 

ఇదిలా ఉంటే, కులగణన, ఎస్సీ వర్గీకరణ తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభలకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. కులగణన సర్వే ఆధారంగా రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వడంపై రాహుల్‌కు రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం. ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల వంటి విషయాలపై రాహుల్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress minister rahul-gandhi

Related Articles