ఖమ్మంలోని మున్నేరు వాగు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఖమ్మం జిల్లా నీట మునిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని మున్నేరు వాగు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాలు, జలమయమైన కాలనీలను అజయ్ కుమార్ పరిశీలించి.. వరదల్లో నష్టపోయిన బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ముగ్గురు మంతులు ఉండి ఏం చేస్తున్నారని నిలదీశారు.
వరదను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని పువ్వాడ మండిపడ్డారు. వాతావరణంశాఖ వారం రోజులుగా చెబుతున్న ప్రభుత్వం ప్రజలకు సమాచారం ఇవ్వలేదని, కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని ఫైర్ అయ్యారు. అనుభవం ఉన్న మంత్రులు ఉన్న విపత్తును ఎదుర్కోవడంలో విఫలమయ్యారని పువ్వాడ అజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్నేరు వాగు వరద బాధితులను ఆదుకోవాలని, ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఇంట్లో సామాన్ల కోసం రూ.2 లక్షలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు.