KCR: కేసీఆర్‌‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 2024-06-25 12:42:47

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మంగళవారం ఎర్రవెల్లిలోని నివాసంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారితో కలిసి కేసీఆర్‌ లంచ్‌ చేశారు. ఇక వారితో బీఆర్‌ఎస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్‌ హయాంలోనే జరిగాయని, అయినా మనం భయపడలేదని కేసీఆర్‌ గుర్తు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు. రేపట్నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయి అన్నారుర.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. భవిష్యత్తులో మనకు‌ మంచి రోజులు వస్తాయని తెలిపారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఎవరూ ఎవరూ భయపడవద్దని కేసీఆర్ సూచించారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.