RSP: కాంగ్రెస్ నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచింది 2024-06-29 00:51:40

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల డిమాండ్ల పై స్పందించక పోతే త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, తర్వాత జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టులను పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అనుమతించాలని, జీవో 46 పై స్పష్టత ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి మోతిలాల్ నాయక్‌ను శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో పరామర్శించారు.

సీఎం రేవంత్ రెట్టికి అలిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఇంటికి ముగ్గురు మంత్రులను పంపించారు. కానీ, కాంగ్రేసు అధికారంలోకి రావడానికి ఎంతో కీలక పాత్ర వహించిన నిరుద్యోగులు పోరాడుతుంటే స్పందించకుండా, ఆమరణ దీక్షలో ఉన్న మోతిలాల్ ను పరామర్శించడానికి కనీసం ఒక్క మంత్రిని కూడ పంపలేదని మండిపడ్డారు.

నిరుద్యోగుల డిమాండ్లన్నీ అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు మాట్లాడినవే అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 6063 కొత్త ఉద్యోగాలను నోటిఫై చేశారని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ రైతులను, మహిళలను, వృత్తులను మోసం చేసినట్లుగా నిరుద్యోగులను కూడా మోసం చేయాలనుకుంటే పప్పులుడకవు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ సమాజమంతా నిరుద్యోగ బిడ్డల పక్షాన నిలబడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.