కాంగ్రెస్ పాలన గురుకుల విద్యార్థులకే కాదు, ఉద్యోగులు, సిబ్బందికి శాపంగా మారిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పాలన గురుకుల విద్యార్థులకే కాదు, ఉద్యోగులు, సిబ్బందికి శాపంగా మారిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎస్సీ గురుకులాల్లో ఉద్యోగులకు వేతనాలు అందించక, పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. గురుకులాల్లో పరిస్థితి ఎలా ఉందంటే రెగ్యులర్ ఉపాధ్యాయులకు సెప్టెంబర్ రెండో వారం దాటినా జీతాలు అందలేదని విమర్శించారు.
పొరుగు సేవల సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు అందలేదని, గెస్ట్ ఫ్యాకల్టీకి మూడు నెలల నుంచి వేతనాలు అందలేదని తెలిపారు. పదవీ విరమణ చేసిన 53 మంది ఉద్యోగులకు పింఛన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, ఒకటో తేదీనే జీతాలు చేల్లిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. ప్రచార యావను పక్కనపెట్టి పరిపాలనపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఎస్సీ గురుకుల ఉద్యోగులకు తక్షణమే జీతాలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.