KTR: కేసీఆర్ మహా సంకల్పం నెరవేరిన రోజిది 2024-06-27 17:36:32

న్యూస్ లైన్ డెస్క్: మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. బీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ మహా సంకల్పం నెరవేరిన రోజిది అని బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతగా పూర్తి అయిన సందర్భంగా ఆయన కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. "సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ" అని ఆనాడే  నాటి సీఎం కేసిఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఖమ్మం నుంచి కరువును శాశ్వతంగా పారదోలే.. వరప్రదాయినికి కేసిఆర్ ప్రాణం పోశారు. ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టించి.. పటిష్ట ప్రణాళికను యుద్ధప్రాతిపదికన అమలు చేశారన్నారు.

ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాల్లో పచ్చని పంటలకు బంగారు బాటలు వేశారన్నారు. ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదు, దశాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదన్నారు. కాలమైనా కాకపోయినా.. పరవళ్లు తొక్కుతున్న ఈ గోదావరి జలాలతో.. ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపారన్నారు. కేసిఆర్ కలను సాకారం చేసి ఈ "జలవిజయం"లో భాగస్వాములైన నీటిపారుదల అధికారులు, సిబ్బందికి  అభినందనలు, కష్టపడిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు కేటీఆర్ తెలిపారు.