ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి గత కొంతకాలంగా చేస్తున్న పనులు అనేకం వివాదాస్పదం అవుతున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి గత కొంతకాలంగా చేస్తున్న పనులు అనేకం వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి కొండల్ రెడ్డి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటన కూడా వివాదాస్పదం అయ్యింది. తనతో సహా ఒక జర్నలిస్టు బృందాన్ని కూడా కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకెళ్లాడు. అయితే ఎటువంటి కారణం లేకుండా, ఏ హోదా లేని కొండల్ రెడ్డి జర్నలిస్టులను విదేశీ పర్యటనకు ఎందుకు తీసుకెళ్లాడని, అసలీ పర్యటన అధికారికమా, లేక ప్రైవేట్ టూర్ ఆ అని చర్చించుకుంటున్నారు.
ఒక వేళ ప్రైవేట్ ట్రిప్ అయితే అన్ని ప్రముఖ మీడియా సంస్థల జర్నలిస్టులు ఎందుకు కొండల్ రెడ్డితో వెళ్లారు అనే పలు ప్రశ్నలు, సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ బృందం అసలు ఎవరిని కలుస్తుంది, ఎందుకు కలుస్తుంది. ఈ పర్యటన వెనక ఉన్న అసలు మతలబు ఏంటని పొలిటికల్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఆస్ట్రేలియా సమావేశాల ఫోటోల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక పక్కకు కూర్చోగా మధ్యలో సింహాసనం వంటి కుర్చీలో ఏ హోదా లేని కొండల్ రెడ్డి కూర్చోవడం గమనార్హం. జర్నలిస్టుల విషయానికి వస్తే తటస్థంగా ఉండాల్సిన జర్నలిస్టులు ఈ విదేశీ పర్యటనలో ఎందుకు జాయిన్ అయ్యారు. రేపు వారు రిపోర్ట్ చేసే వార్తల విశ్వసనీయత ఎంత అని జర్నలిస్టు గ్రూపుల్లో జోరుగా చర్చ సాగుతుంది.