అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ప్రతిష్టాత్మక ఇక్రిశాట్ సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేలా పరిశోధనలు సాగాలన్నారు. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి, కొత్త వంగడాలపై పరిశోధనలు తదితర సమాలోచనల నేపథ్యంలో ఇక్రిశాట్ సంస్థను సందర్శించాల్సిందిగా డైరెక్టర్ జనరల్ హ్యూస్ జాకీ సీఎంని ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన సీఎం రేవంత్ త్వరలోనే ఇక్రిశాట్ క్యాంపస్ ను సందర్శిస్తానని తెలిపారు. భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 1972లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ఇక్రిశాట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ కొత్త వంగడాల పరిశోధనల్లో ప్రపంచానికే మార్గదర్శక సంస్థగా కొనసాగుతోంది. ఇక్రిశాట్ కొలువైన తెలంగాణలోనూ ఆ సంస్థ సేవలను విస్తృతం చేయడం ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగానికి మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.