ఇళ్లపై నిలబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం కనీసం ఆహారాన్ని కూడా అందిచేలేకపోయిందని ఆయన విమర్శించారు. మంచినీళ్లు ఆహారం కూడా అందించలేకపోయారని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, BRS నేతల బృందం పర్యటించింది. పర్యటన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
వరదల కారణంగా ప్రజలు చాలా నష్టపోయారని ఆయన గుర్తుచేశారు. నిత్యావసర వస్తువులతో పాటు పుస్తకాలు కూడా నీళ్లలో కొట్టుకుపోయాయని ఆయన అన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని ఆయన విమర్శించారు. వర్షం తగ్గిపోయి రెండు రోజులు అవుతున్నా.. ఇప్పటికీ కరెంట్ సరఫరాను పునరుద్దరించలేదని అన్నారు. వరద బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని ఆయన అన్నారు.
ఇళ్లపై నిలబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం కనీసం ఆహారాన్ని కూడా అందిచేలేకపోయిందని ఆయన విమర్శించారు. మంచినీళ్లు ఆహారం కూడా అందించలేకపోయారని అన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన వారికి వెంటనే రూ. 2 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డాక్యూమెంట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.