DSC Halltickets : డీఎస్సీ హాల్ టికెట్లో అబ్బాయికి బదులు.. అమ్మాయి ఫొటో

తెలంగాణ డీఎస్సీ ప్రకటించినప్పటి నుంచి రోజుకో వివాదం తెరపైకి వస్తూనే ఉంది. ఒకవైపు సిలబస్ అంతా చదువుకునేందుకురర సమయం సరిపోవడం లేదు. పరీక్ష వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆన్ లైన్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచి.. పరీక్ష నిర్వహించేందుకే సిద్ధపడుతోంది.


Published Jul 16, 2024 07:03:20 AM
postImages/2024-07-16/1721130959_dschallticket.jpg

తెలంగాణ డీఎస్సీ పరీక్ష హాల్ టికెట్ డౌన్ లోడ్ లో రోజుకో కొత్త సమస్య వెలుగు చూస్తోంది. మొన్నటికి మొన్న ఒక జిల్లా పోస్టుకు అప్లై చేసుకుంటే.. మరో జిల్లాకు అప్లై చేసుకున్నట్టుగా హాల్ టికెట్ వచ్చింది. ఈ ఘటన మరిచిపోక ముందే.. మరో అభ్యర్థికి హాల్ టికెట్ పరేషాన్ పట్టుకుంది. హాల్ టికెట్ లో పేరు, వివరాలు, హాల్ టికెట్ నెంబర్ అన్నీ సరిగ్గానే ఉన్నా.. ఫొటో మాత్రం అబ్బాయి ఫోటోకు బదులు అమ్మాయి ఫొటో ఉంది. ఈ విషయం గుర్తించిన అభ్యర్థి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దిద్దుబాటు చర్యలకు దిగారు.

మేడ్చల్ జిల్లా దమ్మయి గూడ బాలాజీ నగర్ కు చెందిన పల్లెపు రామచంద్రయ్య అనే డీఎస్సీ అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. జులై 18న తొలి పరీక్ష ఉండటంతో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. అందులో అతని పేరు, వివరాలు అన్నీ సక్రమంగానే ఉన్నా.. ఫొటో మాత్రం తనది లేదు. వేరే అమ్మాయిది వచ్చింది.  నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. చిట్యాలకు చెందిన రుద్రారపు భవ్య అనే డీఎస్సీ అభ్యర్థిని స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేసి.. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుంది. తీరా చూస్తే.. ఫొటో తనది కాకుండా.. వేరే అబ్బాయిది వచ్చింది. అమ్మాయిల ఫొటోల స్థానంలో అబ్బాయిల ఫొటోలు, అబ్బాయిల ఫొటోల స్థానంలో అమ్మాయిల ఫొటోలు రావడంతో ఆందోళన చెందిన అభ్యర్థులు విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్ అంటూ చాలా కూల్ చెప్పి.. విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. డీఎస్సీ పరీక్ష మరో రెండు రోజుల్లోనే ఉన్నా.. ఇప్పటికీ హాల్ టికెట్ల విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవైపు సిలబస్ పూర్తిగా చదవలేదని.. గడువు తక్కువగా ఉందని అభ్యర్థులు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు సర్కార్ కనీసం హాల్ టికెట్లను కూడా సరిగ్గా రెడీ చేయలేకపోతోందా? అంటూ ప్రశ్నిస్తున్నారు డీఎస్సీ అభ్యర్థులు.

 

newsline-whatsapp-channel
Tags : telangana revanth-reddy newslinetelugu dsc

Related Articles