మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఫోటోకు జీవం పోసేందుకు ఫోటోగ్రాఫర్లు అంకితభావంతో కష్టపడతారని ప్రశంసించారు.
న్యూస్ లైన్ డెస్క్: అంకిత భావంతో సృజనాత్మకంగా తీసిన ఒక ఫోటో కొన్ని పేజీల వార్తా సారాంశమును అర్థవంతంగా తెలియజేసి, పాఠకులను ఆలోచింప చేస్తుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని, ఫోటోగ్రఫీ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రతి రోజు దినపత్రికలు చదవటం అలవాటని, అన్ని వార్తలు చదవక పోయినా, అన్ని పేజీలలోని ఫోటోలను చూసి, ఆ వార్హలోని అంశాన్ని అర్థం చేసుకుంటానని తెలిపారు. 5 కేటగిరీలలో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఫోటోలను తీసిన ఫోటోగ్రాఫర్లుకు మేమెంటో, శాలువా, నగదు పురస్కారాలను మంత్రి అందజేసి, అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఫోటోకు జీవం పోసేందుకు ఫోటోగ్రాఫర్లు అంకితభావంతో కష్టపడతారని ప్రశంసించారు.
ఫోటోగ్రాఫర్ల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు.సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫోటోతో కూడిన వార్త కు పరిపూర్ణత చేకూరుతుందని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ వేడుకల్లో ఆయన గౌరవ అతిథిగా హాజరైనారు. క్షేత్ర స్థాయిలో అనేక ఆటుపోట్లు, ఇబ్బందులను భరించి ఫొటోగ్రాఫర్లు పనిచేస్తారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో జర్నలిస్టుల కంటే ఎక్కువ కష్ట పడి విధులు నిర్వహిస్తారని తెలిపారు. మనిషిని ఆలోచింప జేసే శక్తి ఫోటోలకు వుంటుందని చెప్పారు. ఫోటోగ్రాఫర్లను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని పేర్కొన్నారు. 5 కేటగిరీలలో నిర్వహించిన అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే పోటీలలో 101 మంది 990 ఫోటోలను పంపినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ యం. హనుమంతరావు తెలిపారు. ఫోటోగ్రఫీ, జర్నలిజం లలో నిష్ణాతులైన న్యాయ నిర్ణేతలు ప్రతి కేటగిరీలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు 5 కన్సొలేషన్ బహుమతులకు ఫోటోలను ఎంపిక జేసినట్లు తెలిపారు. ఫోటోగ్రాఫర్లు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అలాగేఎఫ్ డీసిఈడి కిషోర్ బాబు, సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్లు డిఎస్ జగన్, డి శ్రీనివాస్, కే వెంకట రమణ, సిఐఈ రాధా కిషన్, మీడియా అకాడమీ సెక్రెటరీ ఎన్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, శాఖ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.