గ్రూప్ 1, 2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులతో ప్రభుత్వం తరపున ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, విద్యార్థి నాయకులు చర్చలు జరిపారు. వీలైనంత త్వరగా నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల స్పందన వచ్చేలా ప్రయత్నిస్తామని వారు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.
న్యూస్ లైన్ డెస్క్ : గ్రూప్ 1, 2 అభ్యర్థులతో తెలంగాణ టూరిజం ప్లాజాలో ప్రభుత్వం తరపున ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, విద్యార్థి నాయకుడు మానవతా రాయ్, బాలలక్ష్మీ, కిరణ్ యాదవ్, చరణ్ కౌశిక్ చర్చలు జరిపారు. గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ ప్రధాన ఎజెండా జరిగిన ఈ చర్చలు అభ్యర్థులకు సానుకూల దిశగా ఫలితం వచ్చే దిశగా సాగినట్టు తెలుస్తోంది. నేడో, రేపో గ్రూప్ 1, 2 పరీక్షలు వాయిదా ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగులతో చర్చించిన నేతలు.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని.. పరీక్షలు వాయిదా వేసేలా ప్రయత్నిస్తామని గ్రూప్ 1, 2 అభ్యర్థులకు భరోసా ఇచ్చారు.
గ్రూప్ 2 పరీక్ష నవంబర్ చివరి వారానికి, లేదా డిసెంబర్ వరకు వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు. నిరుద్యోగుల డిమాండ్లపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. గ్రూప్ 1 లో 1:100 అమలు చేయడం సాధ్యం కాదని.. చాలా రకాల టెక్నికల్ సమస్యలు వస్తాయని అన్నారు. నిరుద్యోగులు చెప్పిన అంశాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే సీఎం రేవంత్ ఈ విషయమై ఒక ప్రటకన చేస్తారని తెలిపారు. అప్పటి వరకు డీఎస్సీ పరీక్షల మీద దృష్టి పెట్టాలని.. పరీక్షలు బాగా రాయలని సూచించారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. ఎలాంటి నిరసనలు చేపట్టవద్దని ఎంపీ చామల కిరణ్ కోరారు. ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేసేందుకు కృషి చేస్తామన్నారాయన. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చామని.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.