తెలంగాణలో వైద్యారోగ్య శాఖ ప్రణాళికా రహిత బదిలీల వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీనియర్ అధికారులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడంతో ఎక్కువ అవసరం ఉన్న హైదరాబాద్ లోని పెద్ద హాస్పిటల్స్ లో అధికారుల కొరత ఏర్పడింది.
ఎన్నో చారిత్రాత్మక సర్జరీలు, నిత్యం వేలాదిమందికి సేవలందించే ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్ ను మహేశ్వరం మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు. అనుభవం, హాస్పిటల్ మీద పట్టు ఉన్న అధికారులను చిన్న చిన్న ప్రాంతాల్లోని దవాఖానాకు బదిలీ చేయడం పట్ల వారు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాల వద్ద రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖగా మారిందంటున్నారు. ప్రణాళిక లేకుండా చేసిన బదిలీల వల్ల రోగుల ట్రీట్ మెంట్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్ లోని ప్రధాన హాస్పిటల్స్ అయిన ఉస్మానియా, గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ నుంచి హెచ్ఓడీలు, ప్రొఫెసర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో హైదరాబాద్ ప్రధాన హాస్పిటల్స్ లో మెడికల్ ప్రొఫెసర్ల సంఖ్య సగానికి తగ్గిపోయింది. వందలాది మంది రోగులు వచ్చే ఉస్మానియా, గాంధీలో ప్రొఫెసర్ల కొరత ఉంటే.. రోజుకు పదుల సంఖ్యలో మాత్రమే వచ్చే ఫీవర్ హాస్పిటల్ కి ముగ్గురు మెడికల్ ప్రొఫెసర్లు బదిలీ మీద వచ్చారు. సీజనల్ వ్యాధులు విజృంభించే తరుణంలో వైద్యాధికారులను బదిలీ చేసి వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడం సమస్యగా మారింది.