కేబినెట్ నుంచి..కొండా సురేఖ ఔట్ ?

రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు పదవీ గండం తప్పదా అంటే అవుననే సమాధానం వస్తోంది. అక్కినేని కుటుంబంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ దుమారం ఢిల్లీలోనూ


Published Oct 05, 2024 10:19:11 AM
postImages/2024-10-05/1728103751_SUREKHA.jpg

చర్యలకు సిద్ధమవుతున్న అధిష్టానం

ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు చేరిన ఇష్యూ

మంత్రి వ్యాఖ్యలను ఖండించిన సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు, మేధావులు!

ఇప్పటిదాక స్పందించకపోవడంపై రేవంత్ పైనా ఆగ్రహం

అక్కినేని అమలకు ఫోన్ చేసిన ప్రియాంక గాంధీ?

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు పదవీ గండం తప్పదా అంటే అవుననే సమాధానం వస్తోంది. అక్కినేని కుటుంబంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ దుమారం ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ అగ్రనేతలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి ఈ అంశం మైనస్ అయ్యే అవకాశం ఉండడంతో సురేఖపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొండా సురేఖ అంశం ప్రత్యర్థులకు ఆయుధమైందని, బీజేపీ దీన్ని క్యాష్ చేసుకుంటుందన్న భయం కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో నెలకొంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారడంతో కొండా సురేఖను పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో నేడో, రేపో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారన్న చర్చ కూడా జోరందుకుంది.  రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్‌కు ముగింపు పలికేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి రాష్ట్ర నాయకత్వానికి సిగ్నల్స్ అందాయన్న చర్చ జరుగుతోంది. ప్రముఖ సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఆమెను కేబినెట్ నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ ముఖ్యులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

సమంత, అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఇటు సినీ పరిశ్రమతో పాటు అటు మేధావి వర్గం నుంచి కూడా తీవ్రస్థాయిలో ప్రతిస్పందన వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి తమను లాగడాన్ని ఎంతమాత్రం సహించేది లేదంటూ యావత్ సినీ పరిశ్రమ ధిక్కార స్వరం వినిపించింది. దీంతో రేవంత్ సర్కార్‌‌కు దిమ్మతిరిగిందన్న చర్చ జరుగుతోంది. టాలీవుడ్ మొత్తం వారి వెనకే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లో పడిందని విశ్లేషకులు అంటున్నారు.  చిరంజీవి నుంచి మొదలుకుని జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. సీనియర్లు, జూనియర్లు అందరూ ఏకతాటిపైకి రావడంతో ప్రభుత్వ పెద్దలకు సెగ తగిలిందనే చెప్పొచ్చని అంటున్నారు. సమాజంలోని పలు వర్గాల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తడంతో మొత్తానికి ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న భావన హైకమాండ్ కలిగిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దీనిపై పీసీసీ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. 

కాంగ్రెస్‌ను కడిగి పారేసిన జాతీయ మీడియా:

మరోవైపు జాతీయ మీడియా ఇదే అంశంపై డిబేట్లపై డిబేట్లు నిర్వహిస్తోంది. పార్టీ అధిష్ఠానంపై మూకుమ్మడి దాడి చేస్తోంది. సమంత ఇష్యూలో అగ్రనాయకులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సురేఖ అంశమే ఢిల్లీ మీడియాలో చర్చ జరుగుతుండడంతో హైకమాండ్ సీరియస్‌ అయినట్టు తెలుస్తోది. సినీ తారల పట్ల పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరును జాతీయ మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో జరిగిన ఘటనలను కూడా పదే పదే ప్రస్తావిస్తూ ఇరకాటంలో పెడుతున్నారు. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు లేకుండా పోయింది. దీన్ని సమర్థించుకోవడం ఎలాగో తెలియని పరిస్థితిలో వారంతా ఉన్నారు. దీంతో సెల్ఫ్ డిఫెన్స్‌లో పార్టీ పడింది. సురేఖను విమర్శిస్తూనే అధిష్ఠానాన్ని వెనకేసుకు రావాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నేషనల్ మీడియా నిలదీస్తుంటే, వాళ్లకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది.     

అమలకు ప్రియాంక ఫోన్?

ఇదిలా ఉంటే, సినీనటుడు నాగార్జున కుటుంబానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రియాంక గాంధీ స్వయంగా నాగార్జున సతీమణి అమలకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తమ కుటుంబ గౌరవాన్ని మంటగలిపారని  అమల ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. జరిగిన సంఘటనకు తాము చింతిస్తున్నామని, కొండా సురేఖపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని అమలకు ప్రియాంక హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. 

సురేఖ స్థానంలో మరొక బీసీకి ఛాన్స్!

ఈ నేపథ్యంలో కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించి మరో బీసీ నేతకు పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు కూడా వచ్చినట్టు చెబుతున్నారు. పార్టీ పెద్దలు ఇప్పటికే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని తలంటినట్టు తెలుస్తోంది. బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించినట్టుగా చెబుతున్నారు. నేడో, రేపో ఆయన ఢిల్లీకి పయనం కానున్నట్టు సమాచారం. పార్టీ పెద్దల ఆదేశాలతో ఆమె స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna nagachaitanya akhil-akkineni amala priyanka konda-surekha

Related Articles