వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలో గల ముండకై ప్రాంతంలో అర్ధరాత్రి ఒంటిగంటకు, తెల్లవారుజామున 4 గంటలకు మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి.
న్యూస్ లైన్ డెస్క్ : మంగళవారం నాడు తెల్లవారుజామున కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో సంభవించిన ప్రకృతి విలయం 43 మందిని బలి తీసుకుంది. కొండ చరియలు విరిగిపడి.. వందలాది మంది ప్రజలు శిథిలాల కింద చిక్కిపోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న సీఎం పినరయ్ విజయన్ సహాయక చర్యలకు ఆదేశాలిచ్చారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. కొండచరియలు విరిగిపడి చనిపోయిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ పథకం కింద రూ.2 లక్షలు తక్షణ పరిహారం అందించనున్నట్టు, గాయపడ్డ వారికి రూ.50 వేలు అందించనున్నట్టు పీఎంవో ప్రకటించింది.
వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలో గల ముండకై ప్రాంతంలో అర్ధరాత్రి ఒంటిగంటకు, తెల్లవారుజామున 4 గంటలకు మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. ఘటనలో దాదాపు 400 కుటుంబాలు తీవ్రగా నష్టపోయాయి. ప్రాణనష్టం, ఆస్థినష్టం భారీగా జరిగింది. చాలామంది ఆచూకీ లభించడం లేదని బంధువులు, కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. మట్టిదిబ్బల కింద చాలామంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని.. సహాయక చర్యలు వేగంగా చేపట్టామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. కొండచరియలు విరిగిపడటం తీవ్ర విచారకరమని.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. కొండ చరియల కింద ఇరుక్కున వారిని సహాయక బృందాలు క్షేమంగా బయటకు తీసుకు రావాలని కోరుతున్నానని ఆయన అన్నారు.