రాష్ట్రంలో మంత్రులకు తెలియకుండానే కొన్ని శాఖల్లో అవినీతి జరుగుతోందట. శాఖలకు మంత్రులుగా ఉన్నా.. వారికి తెలియకుండానే అందులో రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయట. వాళ్ల ప్రమేయం లేకుండానే వందల కోట్ల స్కాం
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో మంత్రులకు తెలియకుండానే కొన్ని శాఖల్లో అవినీతి జరుగుతోందట. శాఖలకు మంత్రులుగా ఉన్నా.. వారికి తెలియకుండానే అందులో రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయట. వాళ్ల ప్రమేయం లేకుండానే వందల కోట్ల స్కాం జరుగుతోందట. పౌర సరఫరాల శాఖలో జరిగిన సన్నబియ్యం కొనుగోలుకు సంబంధించి వెయ్యి కోట్ల స్కాం, కొత్త లిక్కర్ బ్రాండ్లకు పర్మిషన్ వంటి వ్యవహారాల్లో ఇలాగే జరిగిందనే చర్చ సెక్రటేరియట్ లో నడుస్తోంది. పౌరసరఫరాల శాఖలో సన్నబియ్యం కొనుగోలుకు సంబంధించి భారీ స్కాం జరిగిందని కొద్దిరోజుల క్రితం ఆరోపణలు వచ్చాయి.
రెండు ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర ఆరోపణలు చేశాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల స్కాం జరిగిందని వారు ఆరోపించారు. ఈ స్కాం గురించి.. బయటి వ్యక్తులు చెప్పే వరకు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదట. విషయం తెలిసి డ్యామేజ్ కంట్రోల్ ప్రారంభించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందట. దీంతో ప్రెస్ మీట్ పెట్టి స్కాం ఏం జరగలేదని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇకపై తనకు తెలియకుండా తన శాఖలో వేలు పెట్టొద్దని తెరవెనక ఉన్న వ్యక్తికి కాస్త గట్టిగానే చెప్పారట.
ఇక.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలోకి కొత్త కొత్త బ్రాండ్ల లిక్కర్ ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఇదంతా ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే జరిగిపోయిందట. కొత్త బ్రాండ్లు వస్తున్నాయని మీడియావాళ్లు మంత్రిని అడిగితే అలాంటిదేం లేదని చెప్పారు. ఆయన ఈ మాట చెప్పిన కొద్దిరోజులకే షాపుల్లో కొత్త బ్రాండ్ల బాటిళ్లు దర్శనమిచ్చాయి. దీంతో షాకవ్వడం ఆయన వంతైందట. అప్పటికప్పుడు మళ్లీ డ్యామేజ్ కంట్రోల్ టాక్టిక్ట్స్ చేసినా.. అప్పటికే విషయం జనాల్లోకి వెళ్లిపోవడంతో పరువు అదే లిక్కర్ లో కలిసిందని మంత్రి చాలా బాధపడ్డారట. మంత్రికి తెలియకుండా ఇక్కడ కూడా ఆయనే వ్యవహారం చక్కబెట్టారని తెలుస్తోంది.
ఇవేకాదు.. ఆదాయం వచ్చే ప్రతి శాఖలోనూ ఆ కీలక వ్యక్తి పెత్తనం చేస్తున్నారట. సర్కారుకు వచ్చే ఆదాయం కాకుండా.. ఇతర మార్గాల్లో వచ్చే ఇతర ఆదాయంపైనే ఆయన ఫోకస్ పెట్టారట. ఆదాయం ఏ మార్గం ద్వారా వస్తుందో తెలుసుకుని... మంత్రులకు తెలియకుండానే మూటలు పోగేస్తున్నారట. ఇలా వాళ్లు చేసిన దాంట్లో తను కొంత పర్సంటేజ్ ఉంచుకుని.. మిగతాది పైవారికి ముట్టజెప్పుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా బయటకు వచ్చినవి కొన్నేనని.. బయటపడనివి ఎన్నో ఉన్నాయనే ప్రచారం హస్తం పార్టీలోనే జరుగుతోంది.