తెలంగాణ హైకోర్టు జీవో 46 పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు నిర్ణయంపై విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: జీవో నెం.46 బాధితుల నెత్తిన పిడుగుపడింది. ఉద్యోగాల నియామకంలో గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు నష్టం జరుగుతుందంటూ జీవో నె.46పై బాధితులు వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గత 9 నెలల నుంచి జీవో నెంబర్ 46 రద్దు చేయాలని గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జీవో వల్ల తక్కువ మార్కులు వచ్చిన హైదరాబాద్ అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తున్నాయని.. లోకల్ అనే ఆప్షన్ కింద తమ అవకాశాలు కోల్పోతున్నామని బాధితులు హైదరాబాద్ లో పలుసార్లు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. న్యాయపరంగా పోరాడేందుకు జీవోను రద్దు చేయాలంటూ పిటిషన్ కూడా వేశారు. ఇప్పటి వరకు పలుసార్లు ఈ పిటిషన్ మీద బెంచ్ మీదకు వచ్చినా.. సంబంధిత అధికారి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో.. కేసు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా బెంచ్ మీదకు వచ్చిన జీవో నెంబర్ 46 బాధితుల కేసును రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జీవో నెంబర్ 46 బాధితులు వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.
ప్రభుత్వమే తమకు అన్యాయం చేస్తుందని భావిస్తుంటే.. ఇప్పుడు కోర్టు కూడా మాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిందంటూ జీవో నెంబర్ 46 బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. జీవో నెంబర్ 46 బాధితుల పిటిషన్ ను కొట్టేసి.. వారికి అన్యాయం చేయడం పట్ల బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి స్పందించారు. ఎంతోమంది నిరుద్యోగులు, జీవో 46 భాదితుల పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కితే అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైందని రాకేశ్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులునిరాశ చెందొద్దని జీవో నెంబర్ 46 రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిద్దామని.. మీ పోరాటానికి తన మద్దతు ఉంటుందని రాకేశ్ రెడ్డి హామీ ఇచ్చాారు.