మూడు నెలలుగా జీతం రాక, ఆర్థిక కష్టాలతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వసీం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయనకు మూడు నెలలుగా జీతాలు లేకపోవడమే అని తెలుస్తోంది. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న తరుణంలో, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
ఇప్పటికే ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు కూడా స్పందించారు. మూడు నెలలుగా జీతం రాక, ఆర్థిక కష్టాలతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు.
ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తాం అంటూ డబ్బా కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం ఆలోచించాల్సిన విషయమని తెలిపారు. కాంగ్రెస్ పాలన అన్ని వర్గాల ప్రజలకు శాపంగా మారిందని విమర్శించారు. ఎవరూ అధైర్య పడవద్దని.. నిరాశ చెందవద్దని సూచించారు. బతికి సాధించుకుందామని హరీష్ రావు ధైర్యం చెప్పారు. ప్రజల తరఫున పోరాటం చేసేందుకు BRS పార్టీ సిద్ధంగా ఉందని హరీష్ రావు తెలిపారు.