న్యూస్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంత రావు ఆగడాల గురించి నిజాలు వీడియో రూపంలో చెప్పిన జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా శ్రీనివాస్ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు ఆయనకు 41 సీఆర్పీ సెక్షన్ కింద నోటీసులు పంపారు. శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో.. కోర్టు ఆదేశాలను గౌరవించిన ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మెదక్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఉదయం స్టేషన్ కి వెళ్లిన శ్రీనివాస్ రెడ్డి ఇంకా బయటకు రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మైనంపల్లి హన్మంతరావు దండయాత్ర పేరుతో శ్రీనివాస్ రెడ్డి చేసిన వీడియోపై అభ్యంతరాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు విషయమై ఒకసారి పోలీసులు అరెస్ట్ చేస్తే శ్రీనివాస్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నాడు. మళ్లీ ఇప్పుడు 41 సీఆర్పీ సెక్షన్ నోటీసులు పంపడంతో చట్టాన్ని గౌరవించి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఒత్తిళ్లకు లొంగి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని.. ఆయనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ అరెస్టులను ఆపాలని.. శ్రీనివాస్ రెడ్డిని కాపాడాలని వేడుకుంటున్నారు. అయినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల ఆగడాల గురించి ప్రశ్నిస్తే.. నిజాలు బయట పెడితే అరెస్టులు చేసి భయపెడుతారా? కేసులు పెట్టి జైలుకు పంపుతారా? అంటూ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.