ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని… కానీ, కేబినెట్ మాత్రం కేవలం రూ.31 వేల కోట్లకు మాత్రమే అనుమతిచ్చిందన్నారు. ఇక బడ్జెట్లో రూ.26 వేల కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపి రైతులను మోసం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ముందు రెండు లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింప చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని… కానీ, కేబినెట్ మాత్రం కేవలం రూ.31 వేల కోట్లకు మాత్రమే అనుమతిచ్చిందన్నారు. ఇక బడ్జెట్లో రూ.26 వేల కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపి రైతులను మోసం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
డిసెంబర్ 9లోగా రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆగస్టు 15 అంటూ మరోసారి మాట తప్పారని కేటీఆర్ మండిపడ్డారు. అడ్డగోలు ఆంక్షలు పెట్టి రైతులకు రుణమాఫీ అందకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు.