మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్‌లో నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ పోరులో ఉపాసన యాదవ్(114) శతకంతో చెలరేగడంతో నార్త్ ఢిల్లీ జట్టు సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్‌లో నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ పోరులో ఉపాసన యాదవ్(114) శతకంతో చెలరేగడంతో నార్త్ ఢిల్లీ జట్టు సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఉపాసన ధాటికి సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. అనంతరం భారీ ఛేదనలో సౌత్ ఢిల్లీ బ్యాటర్ తనీషా సింగ్(72) చివరిదాకా పోరాడింది. కానీ, చివరకు నార్త్ ఢిల్లీ 10 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ కొల్లగొట్టింది.
అరుణ్ జైట్లీ స్టేడియంలో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ బౌలర్లను ఉపాసన యాదవ్ ఉతికారేస్తూ సెంచరీతో మెరిసింది. ఉపాసన యాదవ్( 67 బంతుల్లో 114 పరుగులు 18 ఫోర్లు, 3 సిక్సర్ల)తో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. ఆరంభ సీజన్‌లో తొలి శతకం నమోదు చేసిన ఉపాసన జట్టుకు కొండంత స్కోర్ అందించింది. ఆమె విజృంభణతో నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ కూడా ధాటిగానే ఆడింది. ఓపెనర్లు ఛావి గుప్తా(20), శ్వేతా సెహ్రావత్(13)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ తర్వాత క్రీజులో దిగిన తనీసా సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఇక రియా సోని(25)తో కలిసి దంచేసిన ఆమె హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించే ప్రయత్నం చేసింది. కానీ నార్త్ ఢిల్లీ బౌలర్లు ఈ ఇద్దరినీ వెనక్కి పంపి సౌత్ ఢిల్లీని కష్టాల్లోకి నెట్టారు. ఇక ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటర్లు వరుసగా విఫలమైయ్యారు. దీంతో ఆ జట్టు 169 పరుగులకే పరిమితమైంది. ఇక 10 పరుగుల తేడాతో జయభేరి మోగించిన నార్త్ ఢిల్లీ తొలి సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది.