రేకుల షెడ్డులోనే ఉంటున్నామని, ఆ రేకులు పగిలిపోవడంతో నీళ్లు వచ్చినా పట్టించుకునే వారే లేకుండా పోయారని విద్యార్థులు వాపోయారు. వర్షం నీరు లోపలికి వచ్చినా అందులోనే పాఠాలు వినాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు.
న్యూస్ లైన్ డెస్క్: గురుకుల పాఠశాలలకు 30 ఏళ్ల క్రితం నాటి రోజులు వచ్చినట్లే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. విద్యార్థులకు సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారు. మరికొన్ని గురుకులాల్లో పౌష్ఠిక ఆహారం పెట్టకపోవడంతో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ భారిన పడుతున్నారు. విద్యార్థులకు రక్షణ కూడా లేక పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
అంతేకాకుండా, చదువుకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రేకులు పగిలిపోయి నీళ్లు వస్తున్నా అందులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండల పరిధిలోని అల్లీపూర్ బాలుర బీసీ గురుకుల పాఠశాలలో మొత్తం 380 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ సరైన వసతులు అయితే లేవు. రేకుల షెడ్డులోనే ఉంటున్నామని, ఆ రేకులు పగిలిపోవడంతో నీళ్లు వచ్చినా పట్టించుకునే వారే లేకుండా పోయారని విద్యార్థులు వాపోయారు. వర్షం నీరు లోపలికి వచ్చినా అందులోనే పాఠాలు వినాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు.
తరగతి గదుల్లో బెంచీలు లేకపోవడంతో కాటికనేలపైనే కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. పాఠశాల చుట్టూ కనీసం ప్రహరి గోడ కూడా లేదని అన్నారు. అంతేకాకుండా బాత్రూంలకు కూడా తలుపులు లేవని వెల్లడించారు. పాఠశాలకు కావలసినవి సమకూర్చి సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.