బంగారంలాంటి నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం బంగాళాఖాతంలోకి వదిలేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: బంగారంలాంటి నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం బంగాళాఖాతంలోకి వదిలేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని.. అది ఇవ్వకపోగా కనీసం నీళ్లను కూడా ఎందుకు ఎత్తిపోస్తలేరని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఒక పంపును ప్రారంభించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెంలలో 3 చొప్పున పంపులు సిద్ధంగా ఉన్నాయి.. దాదాపు 30 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. కేవలం కేసీఆర్ పాలన మీద విషం చిమ్మడానికే ప్రయత్నిస్తున్నారని, మొన్నటిదాకా కాళేశ్వరం విఫల ప్రయత్నం అన్నారు. దాని నుండే ఇప్పుడు నీళ్లు తీసుకువస్తున్నారని విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం మూలంగానే పాలమూరు నష్టపోయింది అని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పాలమూరు మీద కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ప్రచారం చేశారు. అదే కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి మొదలుపెడితే కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను అడ్డుకున్నారని మండిపడ్డారు.
కేసుల మూలంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముందుగా పంప్ హౌస్‌లు, రిజర్వాయర్లు, సొరంగాలు పూర్తి చేశామని తెలిపారు. కాలువల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిందన్నారు. ఉన్న దానిని వినియోగించుకోకుండా కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి ముందు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు పంప్ హౌస్‌లు .. ఐదు రిజర్వాయర్లు బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసినా వాటిని వినియోగించుకునే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, కేఎల్ఐ పథకంలో కేవలం 3.9 టీఎంసీల నీళ్ల నిల్వకే కాంగ్రెస్ పరిమితం అయిందన్నారు. కేసీఆర్ హయాంలో దాదాపు 60 టీఎంసీల నీటి నిల్వకు పాలమూరులో రిజర్వాయర్లు సిద్ధం చేశామని, 215 టీఎంసీల సామర్థ్యంగల శ్రీశైలం నిండి అలుగు పారుతుంది.. 300 పైచిలుకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అలుగెల్లి పారుతుందన్నారు. వట్టెం రిజర్వాయర్ వరకు నీళ్లు నింపుకోవడానికి అవకాశం ఉందని నార్లాపూర్, ఏదుల, వట్టెం వరకు నీళ్లు తీసుకురావడానికి చిన్న చిన్న అవాంతరాలు ఉన్నాయి అన్నారు. నార్లాపూర్‌లో నీళ్లు నింపుకుంటే కనీసం మంచినీటి కోసం వాడుకోవచ్చు.. దీనికి ఎండాకాలంలో కర్ణాటక మీద ఆధారపడే బాధ ఉండదు అన్నారు.
కేఎల్ఐ పథకం కింద ఉన్న ఐదు పంపులు ఒకేసారి నడిపే అవకాశం లేకుండా కాలువల సామర్థ్యం తగ్గించి ఉమ్మడి రాష్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు దీనికి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. అందుకే అక్కడ నీళ్లు తోడి కేఎల్ఐ పంపుల నుండి, పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ పంప్ హౌస్‌లోని ఒక మోటర్ నుండి నీళ్లు ఎత్తి నార్లాపూర్ రిజర్వాయర్ నింపుకోవచ్చు అన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, నీటి పారుదల శాఖ మంత్రి కానీ, జిల్లా మంత్రి కానీ ఒక్క సారి కూడా సమీక్ష చేయలేదని విమర్శించారు. నీళ్లను వాడుకోవాలన్న ఆలోచన వీరికి లేదన్నారు. ఎనిమిది నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో కనీసం తట్టెడు మట్టి ఎత్తలేదని, పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అమెరికా అందాలను చూసి ఆనందిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల కోసం పాలమూరు ఎంత తండ్లాడిందో.. ఎన్ని జీవితాలనో కోల్పోయిందో వీరికి తెలుసా.. వీరే పాలమూరు బతుకులను మార్చేది అని ప్రశ్నించారు. రాజకీయ కక్ష్యలను పక్కనపెట్టి ప్రభుత్వం స్పందించాలని.. వట్టెం వరకు నీళ్లు నింపుకునే అవకాశం ఉందని.. ఆ విషయంలో ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేఎల్ఐ పథకంలో అయిదు పంపులు ప్రారంభించాలని.. ఎక్కువ వచ్చిన నీళ్లను నార్లాపూర్‌లో నింపాలని.. అన్నింటిని వట్టెం వరకు తరలించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని.. ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నామన్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో రైతులు నీళ్ల కోసం తండ్లాడే పరిస్థితి రావద్దని, రోజుకు 30 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారని నిరంజన్ రెడ్డి ప్రభుత్వంపై వాపోయారు.