తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుండటం ముమ్మాటికీ మన అస్తిత్వంపై దాడే అని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. రేవంత్ ఒక వలసవాద పుత్రుడు అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రైఫిల్ పట్టుకుని బయలుదేరారు. రేవంత్ సీఎం అయ్యాక జై తెలంగాణ నినాదం మసక బారిపోయిందని అన్నారు. జై తెలంగాణ స్థానంలో జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు తెచ్చారని విమర్శించారు.
రేవంత్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ అధికార చిహ్నంలోని చార్మినార్, కాకతీయ తోరణాలను రాచరిక చిహ్నాలని హేళన చేశారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీసేందుకు తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుండటం ముమ్మాటికీ మన అస్తిత్వంపై దాడే అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ స్వాతంత్ర ఉద్యమంలో భరతమాత ఓ ప్రేరణగా ఉంటే.. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి ప్రేరణ అని ఆయన అన్నారు. అనేక చర్చల తర్వాతే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు నివాళిగా తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టామని శ్రీనివాస్ తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడింది కాబట్టి సచివాలయానికి ఆయన పేరు పెట్టామని వెల్లడించారు. సచివాలయం, అమరజ్యోతి మధ్య ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహమే అని ఆయన తెలిపారు. సచివాలయంలో ఉండాల్సింది వ్యక్తుల విగ్రహం కాదు.. తెలంగాణ తల్లి విగ్రహం అని నొక్కి చెప్పారు.