వైఎస్సార్ రాయలసీమకు 350 టీఎంసీల సామర్ధ్యమున్న ప్రాజెక్టులు పూర్తి చేశారు.. తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్, చంద్రబాబుల హయాంలో తెలంగాణలో మూడున్నర క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్న చెరువునైనా కట్టారా? అని అడిగారు.
న్యూస్ లైన్ డెస్క్: మంత్రులు రోజూ పళ్లు తోముకోకపోయినా ఆ బాధ్యత కేసీఆర్‌దా అని మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గురుకులాల్లో పరిస్థితులకు కూడా కేసీఆర్ కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు.. ఇంత కన్నా దారుణం ఉంటుందా? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు ఇంకా చంద్రబాబు, వైఎస్సార్ భజన చేస్తున్నారు. వాళ్లిద్దరూ తెలంగాణలో ఒక్క ఎక్కరానికైనా నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ఆంధ్రా రాయలసీమ ప్రాజెక్టులు పూర్తయి.. తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్ రాయలసీమకు 350 టీఎంసీల సామర్ధ్యమున్న ప్రాజెక్టులు పూర్తి చేశారు.. తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్, చంద్రబాబుల హయాంలో తెలంగాణలో మూడున్నర క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్న చెరువునైనా కట్టారా? అని అడిగారు.
నీళ్లిస్తే వడ్లు పండుతాయని.. వడ్లు పండితే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనని కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఉన్నా సాగునీరు ఇవ్వడం లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ పాలిట ద్రోహులు ఎవరో, దొంగలు ఎవరో తేలాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సెల్బీసీపై కాంగ్రెస్ మంత్రులు హంతకులే సంతాప సభ పెట్టినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు పైసల బలుపుతో.. మరికొందరు ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదని ఆయన విమర్శించారు.
తెలంగాణలోనే తెలంగాణ బిడ్డలను స్థానికేతరులను చేసే విధంగా జీవో-33 తెచ్చారు. ఇంత కన్నా తెలంగాణకు ద్రోహం ఏముంటుంది? అని ప్రశ్నించారు. రేవంత్ తన ఆంధ్రా మిత్రులనో చంద్రబాబునో సంతృప్తి పరచడానికే జీవో 33 తెచ్చారా? అని నిలదీశారు. ఇప్పటికైనా జీవో 33 పై ప్రభుత్వం సోయి తెచ్చుకుని వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంతో కష్టపడి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసి స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. జీవో-33ను వెంటనే రద్దు చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.