న్యూస్ లైన్ డెస్క్ : యుద్దానికి వెళ్లేముందు అన్నీ సిద్ధం చేసుకోవాలి. అస్త్రశస్త్రాలన్ని రెడీ చేసుకున్నాకే యుద్ధరంగంలోకి దుంకాలే. అంతేకానీ.. యుద్ధానికి దిగాక అస్త్రాల కోసం వెతుక్కోవద్దు. సేమ్ ఇదే పాలసీని ఫాలో అవుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సెప్టెంబర్ లోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కాంగ్రెస్ సర్కార్ పై కొట్లాడాలని తొలుత కేసార్ నిర్ణయించుకున్నారు. కానీ.. పార్టీ సీనియర్లు, ముఖ్యుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు.. తన పర్యటన వాయిదా వేసుకుని.. ముందు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాతే జిల్లాల్లో పర్యటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలోని పలువురు సీనియర్లు సైతం ఇదే మాట చెప్పారట. పార్టీని పటిష్టం చేసుకొని వెళ్తే టూర్ మరింత సక్సెస్ అవుతుందని చెప్పారట. దీంతో గులాబీ బాస్ తన ఫోకస్ ను పార్టీ నిర్మాణంపై పడినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ప్రాత పోషించడంతో పాటు తొమ్మిద్దిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వరుస ఓటములు ఊహించని షాక్ ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే ఫలితాలు రిపీట్ అయ్యాయి. అయితే త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు వస్తుండటం ఈ ఎలక్షన్లలో సత్తా చాటాలంటే కచ్చితంగా గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంగా ఉండాలని భావిస్తోంది బీఆర్ఎస్. గ్రామస్థాయి నుంచి పార్టీని నిర్మాణం చేస్తేనే గెలుపు ఈజీ అవుతుందని భావిస్తోందట. ఇప్పటి వరకు పార్టీకి సరైన ప్రణాళికలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల దగ్గర అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఈ నెలలో అధ్యయనం పూర్తి చేసిన వెంటనే పార్టీలో పదవుల పంపకాలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పార్టీ బలోపేతంతో పాటు పార్టీ అనుబంధ సంఘాలైన విద్యార్ధి, కార్మిక, మహిళ, యూత్ వింగుల బలోపేతంపై కూడా ఫోకస్ చేయనుందట బీఆర్ఎస్. పారదర్శకంగా పార్టీ కోసం పని చేసినవాళ్లు, చేసేవాళ్లకే పార్టీలోని కీలక బాధ్యతలు అప్పగించనుందట. అన్ని విభాగాలు బలోపేతం చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. కొత్తవాళ్లకు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా అమలు అవుతాయని భావిస్తున్నారట. అంతేకాదు కొత్త రక్తానికి బాధ్యతలు అప్పగించడంతో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించేవారికి పగ్గాలివ్వాలని ఆలోచన చేస్తోందట బీఆర్ఎస్ పార్టీ.
పార్టీలో సంస్థగత వ్యవహారాలు పూర్తి అయిన తర్వాతే కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రతి జిల్లాలో కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతాల్లోనే తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారట. అప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం అవుతుంది కాబట్టి, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కాస్త టైం ఇచ్చినట్లు కూడా ఉంటుందని భావిస్తున్నారట. అప్పటికీ ప్రజా సమస్యలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రతి పల్లె నుంచి ఉద్యమించి ప్రభుత్వంపై పోరాడేందుకు కసరత్తులు చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.