దీనిపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో పెడుతున్న ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సచివాలయం ముందు కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ గాంధీ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో BRS అధికారంలో ఉండగా.. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు.
అందుకు కోసమే అక్కడ స్థలాన్ని కూడా కేటాయించినట్లు BRS నాయకులు తెలిపారు. అయితే, తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ అంశంపై ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు.
ఇక మరో రెండు రోజుల్లో రాజీవ్ గాంధీ జయంతి ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా, దీనిపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో పెడుతున్న ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
గతంలో తాము ఉన్నపుడు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించిన స్థలంలో పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని BRS పార్టీ అధికారంలోకి రాగానే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.
గతంలో BRS అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు పేరును మార్చకుండా అలాగే ఉంచామని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, తర్వాత BRS అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు తీసేసి పీవీ.నరసింహారావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ అని పేరు మారుస్తామని కేటీఆర్ అన్నారు.