50 మంది ప్రయాణించాల్సిన నిర్మల్ డిపో బస్ జగిత్యాల బస్సులో ఏకంగా 170 మంది ఎక్కడంతో బస్సు టైర్లు ఊడిపోయిన ఘటన ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే, సమయానికి అందరు బస్సు దిగిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
న్యూస్ లైన్ డెస్క్: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినప్పటి నుండి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగిపోయింది. మహిళల ప్రయాణానికి అయ్యే ఖర్చును భరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, బస్సుల సంఖ్యను మాత్రం పెంచలేదు. దీంతో 50 మంది ప్రయాణించాల్సిన బస్సులో మూడు రేట్లు ఎక్కువ మంది వెళ్తున్నారు.
బస్సులు ఓవర్ లోడ్ అవుతున్నాయని, మరో బస్సులో వెళ్లమని చెప్పినా ప్రయాణికులు మాత్రం వినిపించుకోవడం లేదని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. అయితే, 50 మంది ప్రయాణించాల్సిన నిర్మల్ డిపో బస్ జగిత్యాల బస్సులో ఏకంగా 170 మంది ఎక్కడంతో బస్సు టైర్లు ఊడిపోయిన ఘటన ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే, సమయానికి అందరు బస్సు దిగిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
తాజాగా, ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. అమాయక ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు అయితే వచ్చింది. మరి బస్సుల సంఖ్యను ఎప్పుడు పెంచుతారని ఆయన ప్రశ్నించారు. ప్రయాణీకుల సంఖ్యను పరిమితం చేసే విషయంలో ఏదైనా భద్రతా ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. అధిక సమయం పని చేసే డ్రైవర్లు& కండక్టర్లకు ఎలా కంపెన్సషన్ ఇస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.