పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి.. ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్ట్ 15కు రుణమాఫీ చేస్తా అని చెప్పారని అన్నారు. ఆగస్ట్ 15 పోయింది.. రుణమాఫీ కాలేదు.. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఓ దుర్మార్గుడు.. దైవ ద్రోహం చేశారని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గురువారం చేవెళ్లలో జరిగిన రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రుణమాఫీ విషయంపై ఘాటుగా స్పందించారు.
సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు.. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చారని అన్నారు. కొత్తగా వచ్చారు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని ఎదురుచూశామని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి.. ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్ట్ 15కు రుణమాఫీ చేస్తా అని చెప్పారని అన్నారు. ఆగస్ట్ 15 పోయింది.. రుణమాఫీ కాలేదు.. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ను తిట్టి నాలుగు ఓట్లు వేయించుకొని ఆ తర్వాత అవతలపడ్డారని విమర్శించారు. ఆ తర్వాత జులైలో మంత్రివర్గంలో చర్చించి ఏదో విధంగా కటింగ్ పెట్టాలని సీఎంకు మంత్రులు సలహా ఇచ్చారని కేటీఆర్ అన్నారు. అందుకే క్యాబినెట్ మీటింగ్ నాటికి దాన్ని రూ. 31 వేల కోట్లకు తగ్గించారు. ఇక బడ్జెట్‌లో దాన్ని రూ. 26 వేల కోట్లు మాత్రమే పెట్టారని అన్నారు.
రేవంత్ రెడ్డికి పాలన చేతనైతలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చెబితే కోపం వచ్చి మహిళా శాసనసభ్యులను అవమానించారని ఆయన విమర్శించారు. ఒక ఆడబిడ్డ నాలుగున్నర గంటలు నిలబడి మైక్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఏడిపించి దుర్మార్గంగా వ్యవహారించారని మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి లాంటి నేతను నిండు శాసనసభలో అవమానించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందని ఖమ్మం జిల్లాలో సీఎం చెప్పటంతో మొత్తం రైతులు తిరగబడ్డారు. అందుకే భయపడ్డారని కేటీఆర్ అన్నారు.
రుణమాఫీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.. మనం అడగాల్సింది అధికారులను కాదు.. కాంగ్రెస్ నాయకులను అడగాలని కేటీఆర్ సూచించారు. కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా రుణమాఫీ వంద శాతం అయితే ఎందుకు మహిళా జర్నలిస్ట్‌లపై దాడులు చేయించారని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారుల చుట్టూ తిరగాల్సిన ఖర్మ రైతులకు పట్టలేదని ఆయన అన్నారు. రుణమాఫీపై ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలను గల్లా పట్టి నిలదీయాలని కేటీఆర్ అన్నారు.