కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 16 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిందన్నారు. మరి మిగతా రైతుల రుణమాఫీ సంగతి ఏంటని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: రెండు విడతలుగా రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే.. మరోవైపు తమ ఖాతాల్లో డబ్బు జమ కాలేదని రైతులు వాపోతున్నారు. తాజాగా, ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. దేశంలో రైతుల పెట్టుబడులను ఎగ్గొటిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే, అది కాంగ్రెస్సే అని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రూ. లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 39 లక్షల మంది ఉంటే.. ఆ సంఖ్య ఇప్పుడు 45 లక్షలకు పెరిగిందని అయన అన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 16 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిందన్నారు. మరి మిగతా రైతుల రుణమాఫీ సంగతి ఏంటని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2 లక్షల రుణమాఫీని డిసెంబర్ 9నే పూర్తి చేస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రగల్భాలు పలికిందని ఆయన ఎద్దేవా చేశారు. తర్వాత మార్చి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం జూలైలో రుణమాఫీ మొదలు పెట్టిందని తెలిపారు. రూ. లక్ష లోపు రుణమాఫీకి ప్రభుత్వం కేటాయించిన మొత్తం రూ.6 వేల కోట్లు మాత్రమే అని అన్నారు. రూ. లక్షన్నర లోపు రుణాలకు సర్కార్ కేవలం రూ.12 వెల కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల సంబరాలు కనిపించడం లేదని, బ్యాంకుల ఎదుట ఆందోళనలు కనిపిస్తున్నాయని అన్నారు. చిన్న, చిన్న సాకులతో రైతు రుణమాఫీని ఎగ్గొడుతున్నారని విమర్శించారు. గ్రామాల్లో లక్ష లోపు రుణమాఫీ కాని వారు చాలా మంది ఉన్నారని తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ కాని రైతులు 8374852619 కు వివరాలు వాట్సాప్ చేయాలని నిరంజన్ రెడ్డి సూచించారు. ఆ సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.
రైతుబంధు, రైతుభరోసా ఎగ్గొట్టారని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ రైతుబంధు కింద ఒక విడతకు రూ.7,300 కోట్లు ఇచ్చారని అన్నారు. కానీ, రేవంత్ రెడ్డి లాగా పేపర్లలో ప్రకటన ఇవ్వలేదని తెలిపారు. ఒక్కో విడతకు పేపర్ ప్రకటనల కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ఇలాంటి ప్రకటనలకు అప్పుడు దూరంగా ఉన్నారని తెలిపారు.