మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పెద్ద కష్టమే వచ్చి పడిందట. ఏదో జరుగుతుందని వస్తే.. ఇంకేదో అయ్యిందని పూర్తిగా పరేషాన్ లో ఉన్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు. ఇవాళో రేపో హోంమంత్రి
న్యూస్ లైన్ డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పెద్ద కష్టమే వచ్చి పడిందట. ఏదో జరుగుతుందని వస్తే.. ఇంకేదో అయ్యిందని పూర్తిగా పరేషాన్ లో ఉన్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు. ఇవాళో రేపో హోంమంత్రి సీట్లో కూర్చుంటా.. గత పాలకులను జైలుకు పంపిస్తా అని అసెంబ్లీ వేదికగా సవాలు విసిరారు రాజగోపాల్ రెడ్డి. కానీ ఆయనకు.. పార్టీలో కూర్చోడానికి కుర్చీ కూడా సరిగా దొరకడం లేదట. ఏ మెట్టు ఎక్కినా కనీస మర్యాద కూడా దొరకడం లేదట. కార్యకర్తలు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేసే కొందరు మంత్రులు.. రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేస్తే మాత్రం పక్కన పెట్టేస్తున్నారట. దీంతో ఆయన చాలా ఆందోళనలో ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. చివరకు నియోజకవర్గానికి వెళ్లడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు.
అసెంబ్లీలోనే కాదు. నియోజకవర్గంలోనూ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారట రాజగోపాల్ రెడ్డి. నేను మంత్రిని అవుతా. అయ్యాక పెద్ద పెద్ద పదవులు ఇచ్చుకుందాం. పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇప్పిస్తానని కార్యకర్తలు, నాయకులకు చెప్పారట. కానీ నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరగకపోవడంతో.. ఇటీవల కొందరు ఆయనను కలిశారట. ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, ఇచ్చిన హామీల కోసం ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారట. గ్రామాల్లో తల ఎత్తుకుని తిరగలేకపోతున్నామని ఎమ్మెల్యే ముందు కన్నీళ్లుపెట్టుకున్నంత పనిచేశారట..గ్రామాల్లో తమకు ఎదురవుతున్న అవమానాల గురించి చెప్పుకుందామని కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళితే.. ఆయనే తన బాధ మొత్తం వారికి చెప్పుకున్నారని తెలుస్తోంది. పార్టీలో నాకే దిక్కూ దివానం లేకుండా పోయింది..
మీకు పదవులు, పనులు ఎలా చేయాలని చాలా బాధగా చెప్పారని అంటున్నారు. అప్పట్లో అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాట ఇచ్చిన మంత్రులు.. ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదని కార్యకర్తలతో చెప్పుకుంటూ చాలా బాధపడ్డారట రాజగోపాల్ రెడ్డి. అసలు పార్టీలో తనకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని.. పట్టించుకోవడం లేదని కూడా చెప్పారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తానని మాట ఇవ్వడంతోనే తాను పార్టీ మారినట్లు కార్యకర్తలతో చెప్పుకున్నారట. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తనకు మంత్రి పదవి మాత్రం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారంటున్నారు. బీజేపీలో ఉన్నా కాస్త పరువు ఉండేదని, ఎంపీగా పోటీ చేసి గెలిచేవాడిని, కేంద్రమంత్రి పదవి కూడా దక్కేదని.. కాంగ్రెస్ లో చేరి చాలా పెద్ద తప్పు చేశానని కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారట. అంతేకాదు.. తనకు పదవులు రాకపోవడం వెనక తన అన్న, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తం చేశారట రాజగోపాల్ రెడ్డి..తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తారా.? లేదా..ఇవ్వకపోతే పరిస్థితి ఏంటనేది అర్థం కాక.. మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు ఆందోళన పడుతున్నారట.
ఎందుకంటే.. ఎన్నికల ముందు ఏదేదో చేస్తామని హామీ ఇచ్చి ఓట్లేయించాం.. ఇప్పుడు ఏదైనా తేడా జరిగితే గ్రామాల్లో ఎలా తిరగాలంటూ తలపట్టుకుంటున్నారట. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ కే పరిమితం అవుతుండటంతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న కేడర్.. ఇప్పుడు మరింత పరేషాన్ అవుతోందట. నియోజకవర్గానికి దూరం కావడం, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటంతో.. త్వరలోనే మంత్రి పదవి అంటూ మరోసారి లీకులు వస్తున్నాయి. కానీ ఇప్పటికే తనను దారుణంగా అవమానించారని..వాళ్లను నమ్మే పరిస్థితి లేదని సన్నిహితులతో అన్నట్టుగా తెలుస్తోంది. ఈ సారి కేబినెట్ విస్తరణ జరిగి, అందులో తన పేరు లేకపోతే దన దారి తాను చూసుకుంటానని కూడా సన్నిహితులతో చెప్పినట్టుగా అంటోంది. దీంతో ఇప్పుడు ఏం జరగబోతోందన్నది చర్చనీయాంశంగా మారింది.