ప్రకటనలు చేయడం.. ఆ ప్రకటనలు వెనక్కి తీసుకోవడం, హామీలు ఇవ్వడం అభిప్రాయం మార్చుకొని యూటర్న్ తీసుకోవడం కాంగ్రెస్ సర్కార్ కి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంపై కాంగ్రెస్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
న్యూస్ లైన్ డెస్క్ : ప్రైవేట్ ఉద్యోగాల్లో కన్నడిగులకే ప్రాధాన్యం ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై ఆ రాష్ట్ర సర్కార్ యూటర్న్ తీసుకుంది. బిల్లుపై గందరగోళం నెలకొన్నందుకే తాత్కాలికంగా బిల్లు నిలిపేస్తున్నట్టు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. వచ్చే క్యాబినేట్ సమావేశంలో చర్చించి సందేహాలన్నీ నివృత్తి అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇటీవల జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చ జరగలేదు. ఏం చర్చించక ముందే మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. దీంతో.. కాస్త గందరగోళం, సందేహాలు తలెత్తాయి. వచ్చే క్యాబినేట్ సమావేశంలో కూలంకషంగా చర్చించి సందేహాలు నివృత్తి చేస్తామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ప్రైవేట్ బిల్లుపై సీఎం వైఖరి సరిగ్గా లేదని.. క్లారిటీ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో కాంగ్రెస్ సీఎం తమ నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు.