NEET: రూ.30 లక్షలకు నీట్ పేపర్ లీక్ 2024-06-20 12:00:23

న్యూస్ లైన్ డెస్క్: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నీట్-2024 (NEET) పరీక్ష వ్యవహారంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. లంచం తీసుకొని పరీక్షకు ఒక రోజు ముందుగానే నీట్ ప్రశ్న పత్రాన్ని లీక్(question paper leak) చేసినట్లుగా తెలుస్తోంది. 

నీట్-2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపైనే NTAపై కేసు నమోదు చేయడంతో సుప్రీం కోర్టు(supreme court)లో విచారణ జరిపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. వీరిలో బీహార్(bihar)కు చెందిన వారు నలుగురు ఉన్నారు. ఈ 13 మందిలో అనురాగ్ యాదవ్, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్‌(amit anand)తో పాటు దానాపూర్ మునిసిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికందర్ యాదవ్ పేపర్ లీక్‌లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 

అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ ఆనంద్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపెట్టినట్లు పోలీసులు తెలిపారు. నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేందుకు విద్యార్థుల వద్ద నుండి రూ.30 లక్షలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో JE సికందర్‌తో కలిసి రూ.30 లక్షలు తీసుకొని ప్రశ్నా పత్రంతో పాటు సమాధానాలను నలుగురికి ఇచ్చినట్టు వెల్లడించాడు. అయితే, దర్యాప్తులో భాగంగా అమిత్ ఆనంద్ ఇంట్లో కాలిపోయిన జవాబు పత్రాన్ని కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.