కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని గతంలో ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. వరద ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన మేడిగడ్డను మరోసారి చూసి రావాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజల్లో అపోహ పెంచిన కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ టైమ్ చూసి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. భారీ వరదను తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డను ఇప్పుడు వెళ్లి చూడాలంటూ కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతున్నారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
గతంలో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు నానా హంగామా చేశారు. కూలిపోతుందని మీరు ప్రచారం చేసిన మేడిగడ్డ వరద ప్రవాహాన్ని తట్టుకొని ఎలా నిలబడిందో.. మీ రాహుల్ గాంధీని ఇప్పుడు తీసుకెళ్లి చూపించు అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నెలాఖరులో రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్తున్నారుగా.. వరంగల్ నుంచి ఓ రెండు గంటలు ప్రయాణిస్తే మేడిగడ్డ చేరుకోవచ్చు. కూలిపోయింది.. పనికిరాకుండా పోయింది. 80వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలుసుకోకుండా మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు వెళ్లి చూడాలని డిమాండ్ చేశారు సతీష్ రెడ్డి.
ఒకసారి వెళ్లి బ్యారేజీని పరిశీలించి.. ఇప్పుడెలా ఉందో.. ఎంత వరద నీరు చేరిందో తెలుసుకొని ప్రజలకు కూడా చెప్పండి. మేడిగడ్డ ఉందా.? కొట్టుకుపోయిందా.? కూలిపోయిందా..? అని ఆయన అన్నారు. అబద్ధాల అద్దాల మేడలో కాదు.. వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి చూడాలని రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీని ఆయన కోరారు.