కేసీఆర్ ఆదేశాల మేరకు 16వ ఆర్థిక సంఘానికి రిపోర్ట్ ఇచ్చామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా సూచనలు చేశామన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రజా భవన్‌లో నిర్వహించిన 16వ ఆర్థిక సంఘం సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద హజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ తరపున పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. కేసీఆర్ ఆదేశాల మేరకు 16వ ఆర్థిక సంఘానికి రిపోర్ట్ ఇచ్చామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా సూచనలు చేశామన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎంతో ముందుకు తీసుకువెళ్లామని కరెంట్ కోతలు, రైతు ఆత్మహత్యలు లేకుండా చేశామని ఆయన అన్నారు. అత్యధిక జీడీపీ వృద్ధితో దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపామని హరీష్ రావు అన్నారు. పన్నుల వాటా 41 శాతానికి పెంచారన్నారు.. కానీ 31 శాతం నిధులే వస్తున్నాయి అన్నారు. చెప్పిందొకటి చేస్తున్నది ఒకటి.. ఈ విషయాన్ని వివరించడం జరిగిందని తెలిపారు. కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని సర్‌చార్జీలు, సెస్సుల రూపంలో సమకూర్చుకుంటున్నారని తెలిపారు.
ఈ డబ్బును వాట ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అందువల్ల 41% రాష్ట్రాలకు రావాల్సి ఉండగా 31 శాతమే వస్తున్న తీరును వివరించడం జరిగిందని దీన్ని సవరించి రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41 నుండి 50శాతానికి పెంచాలని కోరామని తెలిపారు. నాన్ టాక్స్ రెవెన్యూ కేంద్రానికి చాలా తక్కువగా ఉండేదని 1961లో రూ. 171 కోట్లు ఉంటే, 2024-25లో రూ. 5,46,000 కోట్లకు పెరిగిందన్నారు. నాన్ టాక్ రెవెన్యూలో వాటా ఇవ్వాలని కోరడం జరిగిందని, బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు శిక్ష వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం.. బాగున్నారు కాబట్టి వాటా తక్కువ ఇస్తామనడం అన్యాయం అన్నారు. 13వ ఆర్థిక సంఘంలో రాష్ట్రం వాటా 2.437% ఇచ్చారని 14లో 2.133%కు తగ్గింది. అలాగే 15 నాటికి 2.102% కు తగ్గిందని తెలిపారు. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం మీరైనా మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి.. వెనుకబడ్డ రాష్ట్రాలను ఆదుకోవడంతోపాటు బాగా పనిచేస్తున్న రాష్ట్రాలను నిరుత్సాహపరచకుండా కాపాడాలని కోరడం జరిగిందని హరీష్ రావు పేర్కొన్నారు.